తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నికతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరిగేలా కనిపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా క్రమంగా తగ్గుతూ వస్తుంది. అలాగే ప్రభుత్వం ఎప్పుడో లాక్‌డౌన్ కూడా తీసేసింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహించడానికి సిద్ధమవుతుంది.
అయితే ఉపఎన్నిక కంటే ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో ఏడు ఎమ్మెల్సీ పదవులు భర్తీ కానున్నాయి. శాసనసభ్యుల కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ పదవి భర్తీ చేయాల్సి ఉంది. ఇక మొత్తం పదవులు అధికార టీఆర్ఎస్‌కే దక్కనున్నాయి. ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలని ఆగష్టులోనే పూర్తి చేసేయాలని ఎన్నికల సంఘం చూస్తోంది.
దీంతో అధికార టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇక ఈ పదవుల కోసం పలువురు సీనియర్లు కాచుకుని కూర్చున్నారు. అందులో గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరిలకు ఎమ్మెల్సీ పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావు, మధుసూదనా చారి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు సైతం ఎమ్మెల్సీ పదవిని ఆశించే వారిలో ఉన్నారు. అయితే ఇటీవలే పార్టీలోకి వచ్చిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణకు సైతం ఎమ్మెల్సీ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది.
ఇక వీరితో పాటు పలువురు సీనియర్లు ఎమ్మెల్సీ పదవులని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. పదవులు ఎమ్మెల్సీ పదవులు ఏడు ఉన్నాయి గానీ, ఆ పదవుల కోసం పోటీ పడేవారు పదుల సంఖ్యలో ఉన్నారు. పైగా హుజూరాబాద్ ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ ఆచితూచి పదవుల పంపకాలు చేయాల్సిన అవసరముంది. మరి సీనియర్ల విషయంలో కేసీఆర్ కరుణిస్తారేమో చూడాలి.