నేటి రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులుంటాయి? ఎప్పుడు ఏం జరుగుతుంది? అనేది చెప్పడం చాలా కష్టం. కట్ త్రోట్ పాలిటిక్స్ నేటి రాజకీయాల్లో కామన్ అయిపోయింది. నిన్న ఇంపార్టెంట్ పర్సన్ నేటికి అవసరమే లేకుండా పోయే చాన్సెస్ పుష్కలంగా ఉంటాయి. ఒకేసారి వ్యక్తి ఇంపార్టెన్స్ అమాంతంగా పెరిగిపోయే చాన్సెస్ ఉంటాయి. ఇందుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉదాహారణ అని చెప్పొచ్చు. టీఆర్ఎస్ పార్టీలో పలు పదవులు పొందిన రాజేందర్‌ను ఓడించేందుకు ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఎత్తులు వేస్తుందో మనం గమనించొచ్చు. కాగా, ఈటల పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత మంత్రి హరీశ్‌రావుకు గులాబీ పార్టీలో ప్రాధాన్యత పెరిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే హరీశ్ అనుచరుడికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పినట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి.
దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో ఇన్‌చార్జిగా వ్యవహరించిన మంత్రి హరీశ్‌రావు అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి కూడా ఒకరకంగా బాధ్యులే. ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరఫున విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. కానీ, చివరకు ఓటమి పాలయింది టీఆర్ఎస్. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీశ్ ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోతుందని అనుకున్నారు. కానీ, సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్‌కు ఇంకా ఎక్కువ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్ హుజురాబాద్ కుల సంఘాల నేతలతో సిద్దిపేటలో సమావేశమవడంతో పాటు నేతల చేరిక సందర్భంగా హాజరు కావడాన్ని మనం చూడొచ్చు. తద్వారా మంత్రి హరీశ్‌కు ఇంకా ఎక్కువగా సీఎం ప్రాధాన్యతనిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ కాబోతుండగా, ఈ స్థానాలు ఎవరికి ఇవ్వాలి అనే విషయమై టీఆర్ఎస్ పార్టీలో ఇప్పడే చర్చిస్తున్నట్లు సమాచారం. మంత్రి హరీశ్ అనుచరుడు ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు సమాచారం. పద్మశాలి సామాజిక వర్గం నుంచి ఇటీవల పార్టీలో చేరిన ఎల్.రమణకు కూడా ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. కాగా, మంత్రి హరీశ్ అనుచరుడైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు డెఫినెట్‌గా ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో, టీఆర్ఎస్ శ్రేణుల్లో జరుగుతోంది.