ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా మహమ్మారికి సైంటిస్టులు ఇంకా వ్యాక్సిన్‌ను తయారు చేయలేదు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేయడంలో హైదరాబాద్‌కు చెందిన మరొక కంపెనీ తాజాగా కొంత వరకు ముందడుగు వేసింది. పలు అంతర్జాతీయ సంస్థలతో తయారు చేస్తున్న ఆ వ్యాక్సిన్ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేయడంలో కొంత వరకు సక్సెస్‌ను సాధించింది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మ్యాడిసన్‌తోపాటు ఫ్లూజెన్ అనే కంపెనీతో కలిసి భారత్ బయోటెక్.. కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. ఈ క్రమంలోనే ఫ్లూజెన్‌కు చెందిన ఎం2ఎస్ఆర్ అనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి ‘కోరోఫ్లూ (CoroFlu)’ అనే వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నారు.
కాగా కోరోఫ్లూ వ్యాక్సిన్‌నుకు గాను హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ త్వరలో ప్రారంభం కానుండగా.. తొలి దశలో 300 మిలియన్ల కోరోఫ్లూ డోసులను సిద్ధం చేస్తామని భారత్ బయోటెక్ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ డాక్టర్ రేచెస్ ఎల్లా తెలిపారు. కాగా 2009లో స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు తమ కంపెనీ అందుకు వ్యాక్సిన్‌ను తయారు చేసిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ తయారీలోనూ తాము విజయం సాధిస్తామని రేచెస్ ఎల్లా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక కోరోఫ్లూ వ్యాక్సిన్‌ను కరోనా రోగులకు నాసికా రంధ్రాల్లో డ్రాప్స్ రూపంలో ఇస్తారు. దీంతో వ్యాక్సిన్ నేరుగా ఆ వైరస్‌పై ప్రభావం చూపుతుంది. శరీర రోగ నిరోధక శక్తిని ఎన్నో రెట్లు పెంచుతుంది. దీంతో వైరస్ నాశనమవుతుంది. అయితే కోరోఫ్లూ వ్యాక్సిన్‌పై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నందున.. ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు మరో 6 లేదా 7 నెలల సమయం పట్టే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.