చరిత్రలో ఎప్పుడూ చూడని రాజకీయం 2019-24 మధ్య చూశానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తన లాంటి వాళ్లు కూడా బయటకు రాని పరిస్థితి ఆ మధ్య కాలంలో వచ్చిందని తెలిపారు. మనుషులు పారిపోతుంటే కందకాలు తవ్వేవారని.. హెలికాప్టర్ లో వస్తే కింద చెట్లను నరికేశారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఊహించనిదానికంటే ఎక్కువ పనులు చేశామని చంద్రబాబు తెలిపారు. ఈ నెలలో జ్యోతిబాపూలే, బాబు జగ్జీవన్ రాం, బీఆర్ అంబేడ్కర్ లాంటి ముగ్గురు మహనీయులు పుట్టారని గుర్తు చేశారు.
అమరావతికి దేశంలోని మంచి కాలేజీలు వస్తున్నాయని.. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలను ఇక్కడకి తీసుకొస్తామని వెల్లడించారు. ప్రజల ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ’91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి.. ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధి సాధ్యమైంది.. 95లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది.. ఆరోజు తీసుకున్న చర్యలతో ఇప్పుడు అందరి వద్ద ఫోన్లు ఉన్నాయి.. స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం 2047 విజన్ తయారు చేశాను’ అని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.