ఎన్టిఆర్ జిల్లాలో బటన్ నొక్కి విద్యా కానుకను తల్లుల ఖాతాల్లో జమ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9 లక్షల 86 వేళ మందికి మంచి జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. నేరుగా తల్లుల ఖాతాలో నిధులు వేశామని.. కుటుంబ తలరాతలు మార్చాలి అంటే విద్యతోనే సాద్యం అన్నారు. ఉన్నత స్థానంలో విద్యార్థులు నిలవాలన్న ఆకాంక్ష నాదన్నారు సీఎం జగన్.
హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు చుసి వసతి దీవెన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదివినా ఫీజుల బాధ్యత ప్రభుత్వమే తీసుకుందన్నారు. ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కళ్ళారా చూశానని.. చదువుకునే ప్రతీ విద్యార్థికి నేనే అండగా ఉంటానన్నారు. వివక్షతకు తావు లేకుండా, లంచాలు లేకుండా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం ఎగొట్టిన 1700కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించిందని వివరించారు. ఫీజులు మొత్తాన్ని కాలేజీల్లో కాకుండా తల్లుల ఖాతాల్లో వేస్తున్నామన్నారు. కాలేజీలను ప్రశ్నించే తత్వం కోసమే తల్లుల ఖాతాల్లో ఫీజులు వేస్తున్నామని స్పష్టం చేశారు సీఎం జగన్. ఏప్రిల్ 11వ తేదీన రెండో విడత వసతి దీవెన తల్లుల ఖాతాల్లో వేస్తున్నామన్నారు.