భారత్-పాకిస్థాన్ సరిహద్దులో వాయుసేనకు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. రాజస్థాన్ బాడ్మేర్ జిల్లాలోని భిమ్డా గ్రామంలో యుద్ధ విమానం మిగ్-21 కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు.
భిమ్డా సమీపంలో గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్రువీకరించింది. విమానం కూలిన సమయంలో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. దీనికి సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ప్రమాదంపై భారత వాయుసేన అధిపతి మార్షల్ వీఆర్ చౌదరితో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పైలట్ల మృతి పట్ల రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి సేవను దేశం ఎప్పుడూ మరిచిపోదన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.