మన శరీరానికి నిత్యం అన్ని పోషకాలతో కూడిన ఆహారం అవసరం అన్న సంగతి తెలిసిందే. కార్బొహైడ్రేట్లు (పిండిపదార్థాలు), ప్రోటీన్లు (మాంసకృత్తులు), ఫ్యాట్స్ (కొవ్వులు) వీటిని స్థూల పోషకాలు అంటారు. ఇవి మనకు నిత్యం ఎక్కువ మొత్తంలో అవసరం అవుతాయి. విటమిన్లు, మినరల్స్ ను సూక్ష్మ పోషకాలు అంటారు. ఇవి తక్కువ మొత్తంలో అవసరం అవుతాయి. కనుక ఎవరైనా సరే.. స్థూల, సూక్ష్మ పోషకాలు అన్నీ కలిసిన ఆహారాలను నిత్యం తీసుకోవాలి. ఇక ఆరోగ్యంగా ఉండేందుకు అన్ని పోషకాలతో కూడిన ఆహారాన్ని 2వేల క్యాలరీల శక్తిని ఇచ్చేదిగా చూసుకోవాలి.
ఐసీఎంఆర్ సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. నిత్యం మనకు కార్బొహైడ్రేట్ల ద్వారా 45 శాతం శక్తి కావాలి. అందుకు గాను బియ్యం, ఇతర ధాన్యాలను 270 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. అలాగే పప్పు దినుసులను 90 గ్రాముల వరకు తింటే మన శరీరానికి కావల్సిన శక్తిలో 17 శాతం వరకు లభిస్తుంది. ఈ శక్తి ప్రోటీన్ల ద్వారా వస్తుంది.
ఇక నిత్యం 300 గ్రాముల వరకు పాలు, పెరుగు తీసుకోవాలి. దీంతో మనకు నిత్యం కావల్సిన 2వేల క్యాలరీల్లో 10 శాతం శక్తి అందుతుంది. అలాగే 150 గ్రాముల మోతాదులో పండ్లను తింటే 3 శాతం శక్తి లభిస్తుంది. ఇక మరో 20 గ్రాముల నట్స్, మొలకెత్తిన విత్తనాలను తింటే రోజుకు కావల్సిన శక్తిలో 8 శాతం లభిస్తుంది. అదే మరో 27 గ్రాముల నెయ్యి, ఇతర ఫ్యాట్స్ ను తీసుకుంటే మరో 12 శాతం శక్తి లభిస్తుంది. దీంతో మన శరీరానికి కావల్సిన శక్తి మొత్తం అందుతుంది. అది కూడా భిన్న రకాల ఆహారాల నుంచి లభిస్తుంది. అందువల్ల శరీరానికి సంపూర్ణ పోషణ లభిస్తుంది. అంతేకానీ.. ఏదో ఒక రకానికే చెందిన ఆహారాలను మాత్రమే నిత్యం తీసుకోకూడదు. అన్ని రకాల ఆహారాలను సమపాళ్లలో తీసుకున్నప్పుడే శరీరానికి పోషణ లభిస్తుంది.