లాక్‌డౌన్ ఎత్తేయాల్సి వ‌స్తే.. ద‌శ‌ల‌వారీగా ఇలా అమ‌లు చేస్తారు..!

-

దేశంలో రోజు రోజుకీ క‌రోనా కేసుల సంఖ్య బాగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్ర‌ధాని మోదీని కోరాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు రాష్ట్రాలు ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి కూడా. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ప్ర‌ధాని మోదీ లాక్‌డౌన్‌ను మ‌రో 14 రోజుల వ‌ర‌కు పొడిగించే అవకాశ‌మే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆ గ‌డువు కూడా ముగిస్తే.. లాక్‌డౌన్‌ను ఎత్తేయాల్సి వ‌స్తే.. కేంద్రం ప‌లు ద‌శ‌ల్లో లాక్‌డౌన్‌ను ఎత్తేస్తూ.. ద‌శ‌ల‌వారీగా ఆంక్ష‌లు స‌డలిస్తూ.. చివ‌ర‌కు పూర్తిగా లాక్‌డౌన్‌ను ఎత్తేస్తుంద‌ని తెలుస్తోంది. అందులో భాగంగానే కింద తెలిపిన విధంగా కేంద్రం చ‌ర్య‌ల‌కు పూనుకుంటుంద‌ని తెలుస్తోంది.

if central government lifts lock down then it will be lifted in these phases

మొద‌టి ద‌శ…

ఈ ద‌శ‌లో ఒక జిల్లాలో రివ్యూ చేసే స‌మయానికి వారం నుంచి కొత్త‌గా క‌రోనా కేసులు న‌మోదు కాకూడ‌దు. అలాగే హోం క్వారంటైన్‌, హోం స‌ర్వేలెన్స్‌లో ఉండే వారి సంఖ్య 10 శాతానికి మించ‌కూడ‌దు. అలాగే జిల్లాలో ఎక్క‌డా హాట్ స్పాట్స్ ఉండ‌కూడ‌దు.

రెండో ద‌శ‌…

ఈ ద‌శ‌లో క‌రోనా కేసులు అస్సలు న‌మోదు కాకూడ‌దు. హోం క్వారంటైన్‌, స‌ర్వేలెన్స్‌లో ఉండే వారి సంఖ్య 5 శాతానికి మించ‌రాదు. హాట్ స్పాట్స్ ఉండ‌కూడ‌దు.

మూడో ద‌శ‌…

ఈ ద‌శ‌లో రివ్యూ చేస్తే.. ఒక జిల్లాలో కొత్త‌గా కరోనా కేసులు న‌మోదు కాకూడదు. హోం క్వారంటైన్‌లో ఉండేవారి సంఖ్య 5 శాతం నుంచి త‌గ్గుతూ ఉండాలి. హాట్‌స్పాట్స్ ఎక్క‌డా ఏర్పాటు కాకూడ‌దు.

* ఇక ప్ర‌తి ద‌శ‌లోనూ పౌరుల‌కు ప‌లు ఆంక్ష‌ల నుంచి స‌డ‌లింపులు ఇస్తారు. మొద‌టి ద‌శ‌లో పౌరులు మాస్కులు లేకుండా బ‌య‌ట‌కు రాకూడ‌దు అనే ఆంక్ష‌లు ఉంటాయి. అలాగే ఒక ఇంటి నుంచి ఒక‌రు మాత్ర‌మే బ‌య‌ట‌కు రావాల్సిందిగా ఆదేశాలు ఉంటాయి. ఇక ఒక వ్య‌క్తి బ‌య‌టికి వ‌స్తే బ‌య‌ట 3 గంట‌ల క‌న్నా ఎక్కువ స‌మ‌యం ఉండ‌రాదు. అవ‌స‌రం అనుకుంటే త‌ప్ప ఎక్కువ స‌మ‌యం బ‌య‌ట గ‌డ‌ప‌రాదు. అలాగే 65 ఏళ్లు పైబ‌డిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇండ్ల‌లోనే ఉండాలి. వారిని బ‌య‌ట‌కు అనుమ‌తించ‌రు. అలాగే ప్రైవేటు వాహ‌నాల‌ను ఆడ్ – ఈవెన్ విధానంలో బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు అనుమ‌తినిస్తారు. ఇక విమానాలు, బ‌స్సులు, రైళ్లు స‌హా.. ప్ర‌జా ర‌వాణా అంతా.. నిలిచిపోయి ఉంటుంది.

* రెండో ద‌శ‌లో పౌరుల‌కు మార్నింగ్ వాక్‌ల‌కు వెళ్లేందుకు అనుమ‌తినిస్తారు. ఇంటి నుంచి 500 మీట‌ర్ల దూరం వ‌ర‌కు వారు మార్నింగ్ వాక్‌కు వెళ్ల‌వ‌చ్చు. అది కూడా ఉద‌యం 7.30 లోపే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఆటోలు, ట్యాక్సీల్లో కేవ‌లం 3 ప్ర‌యాణికుల‌కు మాత్ర‌మే అనుమ‌తినిస్తారు. బ‌స్సుల్లో ఒక సీటుకు ఒకే వ్య‌క్తి కూర్చోవాల్సి ఉంటుంది. నిల‌బ‌డ‌డం ఉండ‌దు.

* మూడో ద‌శ‌లో ఒక జిల్లా నుంచి మ‌రొక జిల్లాకు బ‌స్సులు తిరిగేందుకు అనుమ‌తినిస్తారు. కానీ వాటిలో 2/3 వ వంతు మాత్ర‌మే ప్ర‌యాణికులు ఉండాలి. అలాగే డొమెస్టిక్ విమానాలు తిరిగేందుకు అనుమ‌తిస్తారు. కానీ వాటిల్లో 50 శాతం మంది ప్ర‌యాణికుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు. ఇక ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే వారు త‌ప్ప‌నిస‌రిగా 14 రోజుల వ‌ర‌కు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.

మూడో ద‌శ ముగిశాక‌.. అవ‌స‌రాన్ని బ‌ట్టి పూర్తిగా లాక్‌డౌన్‌ను ఎత్తేయాలా..? లేదా.. అదే ద‌శ‌ను కొన్ని రోజుల పాటు కొనసాగించాలా..? అన్న నిర్ణ‌యం తీసుకుంటారు..!

Read more RELATED
Recommended to you

Latest news