చాలా మంది పీఎఫ్ ఖాతాదారులు అవసరాన్ని బట్టి తమ అకౌంట్‌లో డబ్బులను విత్‌డ్రా చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల పీఎఫ్ ఖాతాదారులు ఎంతో నష్టపోతారని కేంద్రం తెలిపింది. పీఎఫ్ డబ్బులు పొదుపు చేసుకున్నప్పుడే మంచి వడ్డీతో డబ్బులు పెరుగుతాయని వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప డబ్బులు వృథాగా ఖర్చు పెట్టడానికి విత్‌డ్రా చేయవద్దని హెచ్చరిస్తోంది. అయితే ఉద్యోగ కాలపరిమితి ఉన్నప్పుడు పీఎఫ్ ఖాతాదారులు రూ.1 లక్ష విత్‌డ్రా చేసినట్లయితే రూ.11 లక్షల వరకు నష్టపోతారు. రూ.1 లక్ష డ్రా చేస్తే రూ.11 లక్షలు ఎలా నష్టపోతామని ఆలోచిస్తున్నారా..? అయితే మీరు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి.
మనీ 9 నివేదిక ప్రకారం.. ఓ ఉద్యోగి పదవీ విరమణ సమయం ఇంకా 30 సంవత్సరాలు ఉండి.. ఆ సమయంలో తన పీఎఫ్ ఖాతా నుంచి రూ.1 లక్ష విత్‌డ్రా చేసుకున్నప్పుడు పదవీ విరమణ నిధి రూ.11.55 లక్షలు తగ్గుతుందని రిటైర్డ్ ఈపీఎఫ్ఓ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. పీఎఫ్ ఖాతాదారుడు రూ.లక్ష విత్‌డ్రా చేయడం వల్ల ఎంతో డబ్బు నష్టపోతాడని, అందుకే డబ్బులు ఎక్కువ శాతం విత్‌డ్రా చేయకుండా చూసుకోవాలన్నారు. పదవీ విరమణ ముగిసినప్పుడు డబ్బులు తీసుకుంటే లాభం ఉంటుందన్నారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉపసంహరించుకోవడం వల్ల మీకే నష్టం ఉంటుందన్నారు. డబ్బులు ఎక్కువ రోజుల వరకు ఉంటే దానికి తగ్గట్లు వడ్డీ లభిస్తుందన్నారు. ప్రస్తుతం పీఎఫ్ డబ్బులపై కేంద్రం 8.5 శాతం వడ్డీ ఇస్తోంది. పెద్ద మొత్తంలో ఈపీఎఫ్‌లో డబ్బులు పెడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
20 ఏళ్లకు ముందే డబ్బులు డ్రా చేస్తే..
పీఎఫ్ ఖాతాదారుడు తన పదవీ విరమణ వయసు ఇంకా 20 సంవత్సరాలు ఉంది అనుకోండి. 20 ఏళ్లకు ముందు రూ.50 వేలు విత్‌డ్రా చేసుకున్నట్లయితే.. రూ.2 లక్షల 5వేల నష్టం వాటిల్లుతుంది. అదేవిధంగా రూ.1 లక్ష విత్‌డ్రా చేసినట్లయితే రూ.5.11 లక్షల నష్టం వస్తుంది. రూ.2 లక్షలు విత్‌డ్రా చేసినట్లయితే రూ.10.22 లక్షలు, రూ.3 లక్షలు విత్‌డ్రా చేసినట్లయితే రూ.15.33 లక్షల నష్టం వస్తుంది. అందుకే అనవసరమైన విషయాలకు పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవద్దు.
30 ఏళ్లకు ముందే..
ఖాతాదారుడి పదవీ విరమణ వయసు ఇంకా 30 సంవత్సరాలు ఉన్నట్లయితే.. రూ.50 వేలు విత్‌డ్రా చేస్తే.. రూ.5.27 లక్షలు నష్టపోతారు. రూ.1 లక్ష ఖాతా నుంచి ఉపసంహరించుకున్నట్లయితే రూ.11.55 లక్షలు నష్టపోతారు. రూ.2 లక్షలు తీసుకుంటే రూ.23.11 వేలు, రూ.3 లక్షలు తీసుకుంటే రూ.34.67 లక్షలు నష్టం వస్తుంది. అందుకే నిపుణులు కూడా అత్యవసరం ఉంటే తప్ప పీఎఫ్ డబ్బులు డ్రా చేయొద్దని సలహా ఇస్తున్నారు.