రాగి దిబ్బరొట్టెను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే బోలెడు ప్రయోజనాలు..!

-

చిరుధాన్యాలను వాడే వారి సంఖ్య ఈ మధ్య పెరిగింది. తెల్లరవ్వతో చేసిన టిఫెన్స్‌ కాకుండా.. రాగులు, సజ్జలు, జొన్నలుతో చేసిన పిండితో టిఫెన్స్‌ వేసుకుంటున్నారు. రాగులను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. కానీ రాగులను ఎలా తినాలి..? జావ చేసుకోవడం మీకు ఎలాగూ తెలుసు..? రాగి సంగటి..ఇది చికెన్‌, మటన్‌లోకే మస్త్ ఉంటుంది. రాగి ర‌వ్వ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన మ‌రియు ఆరోగ్యక‌ర‌మైన వంట‌కాల్లో రాగి దిబ్బ‌రొట్టె కూడా ఒక‌టి. రాగి దిబ్బ‌రొట్టె చాలా రుచిగా ఉంటుంది. అలాగే మెత్త‌గా, మృదువుగా ఉంటుంది. ఈ దిబ్బ‌రొట్టెల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. త‌రుచూ ఒకేర‌కం దిబ్బ‌రొట్టెలు కాకుండా ఇలా వెరైటీగా ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని కోరుకునే వారికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. రాగుల‌తో దిబ్బ‌రొట్టెల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.!

రాగి దిబ్బ‌రొట్టె త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మిన‌పప్పు – ఒక గ్లాస్,
రాగి ర‌వ్వ – 3 గ్లాసులు,
ఉప్పు – త‌గినంత.

ఎలా చేసుకోవాలంటే..

ముందుగా మిన‌ప‌ప్పును శుభ్రంగా క‌డిగి 4 గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత ఈ మిన‌ప‌ప్పును జార్‌లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత రాగి ర‌వ్వ‌ను శుభ్రంగా క‌డిగి నీటిని పిండేస్తూ మిక్సీ ప‌ట్టుకున్న పిండిలో వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి రాత్రంతా పులియ‌బెట్టాలి. పిండి చ‌క్క‌గా పులిసిన త‌రువాత ఇందులో ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత స్ట‌వ్ మీద మందంగా ఉండే క‌ళాయిని ఉంచి నూనె వేసుకోవాలి. త‌రువాత పిండి వేసి పైన మ‌ర‌లా నూనె వేసుకుని మూత పెట్టాలి. దీనిని చిన్న మంట‌పై 7 నుండి 8 నిమిషాల పాటు కాల్చుకున్న త‌రువాత నెమ్మ‌దిగా క‌ళాయి నుండి వేరు చేసి పెనం మీద వేసుకోవాలి. త‌రువాత మ‌రికొద్దిగా నూనె వేసి చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి దిబ్బ రొట్టె త‌యార‌వుతుంది. కావాలంటే.. మీరు ఉదయం ఆ పిండిలోకి ఉల్లితరుగు, పచ్చిమిర్చి, క్యారెట్‌ తురుము, కొత్తిమీర కూడావేసుకోవచ్చు. దీనిని చ‌ట్నీ, సాంబార్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది. రాగులను ఎలా వాడినా ఆరోగ్యానికి మంచిదే. కాబట్టి ఇలాంటి వెరైటీస్‌ చేసి తినడం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.

Read more RELATED
Recommended to you

Latest news