ఈటల రాజేందర్ అనే పేరు చుట్టూ ఇప్పుడు తెలంగాణ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారా అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైపోయిందని తెలుస్తోంది. దీంతో అసలు ఆయన ఆ పార్టీలోకి వెళ్తే ఎలా నెగ్గుకొస్తారని అంతా అనకుంటున్నారు. ఇందుకు ఆయన రాజకీయ ప్రస్థానమే కారణం.
మొదట కమ్యూనిస్టు నేతగా ఆయన రాజకీయ జీవితం మొదలైంది. సీపీఎం నుంచి ఆయన ఆయన టీఆర్ ఎస్‌వైపు మళ్లారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయన టీఆర్ ఎస్‌లో చేరి ఆ పార్టీలో ఉద్యమకారుడిగా గుర్తింపు పొందారు. కేసీఆర్‌కు కుడిభుజంగా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.
ఇక ఇప్పుడేమో టీఆర్ ఎస్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ కావడంతో.. త్వరలోనే టీఆర్ ఎస్ నుంచి కూడా వైదొలుగుతారని తెలుస్తోంది. ఇక బీజేపీలో చేరితే ఆయన అక్కడున్న సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తారా అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే కమ్యూనిస్టు భావజాలం ఉన్న ఈటల… అందుకు పూర్తి విభిన్నమైన మతతత్వ పార్టీలో నెగ్గుకొస్తారా అనేది పెద్ద సమ్యగా మారింది. ఆ పార్టీలో ఉన్న దూకుడు రాజకీయాలకు ఈటల మాటల రాజకీయాలకు చాలా గ్యాప్ ఉంది. అలాగే కొందరు ఆయన చేరికను డైరెక్టుగానే వ్యతిరేకిస్తున్నారు. పైగా ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. చాలా సమయం కూడా పడుతుంది. మరి ఇన్ని సమస్యల మధ్య ఆయన కాషాయ పార్టీలో ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.