ప్రభుత్వం సిజేరియన్ల కన్న నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతోంది. ఇందు కోసం నార్మల్ డెలివరీలు చేస్తే ఏఎన్ఎంలకు, ఆశా కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి రూ. 3000 పారితోషికం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ ఉత్సాహమే చివరకు శిశువు ప్రాణాలు తీసింది. తల్లిని ప్రమాదకర స్థితిలో పడేసింది. ఈ ఘటనల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. భద్రాచలం గవర్నమెంట్ ఆస్పత్రిలో బాధితురాలు ప్రసవం కోసం చేరింది. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా బిడ్డను కోల్పోయింది. ప్రసవం కోసం వచ్చిన విజయకుమారి గర్భంలోనే శిశువు మరణించింది. ఈ నెల 4న ప్రసవం కోసం బాధితురాలు ఆస్పత్రిలో చేరగా.. నార్మల్ డెలివరీ కోసం డాక్టర్లు నిన్నటి వరకు ప్రసవం చేయలేదు. నార్మల్ డెలివరీ కోసం నాలుగు రోజులుగా బాధితురాలుకు మందులు ఇచ్చారు డాక్టర్లు. మందులు వేసుకున్నాక మహిళకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో కడుపులోనే శిశువు మృతి చెందడంతో నిన్న అర్థరాత్రి ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు డాక్టర్లు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే శిశువును కోల్పోయనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డుల కోసం తన బిడ్డను బలిచేశారని కన్నీరుమున్నీరు అవుతున్నారు. డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.