క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవడం అంటే కత్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాకపోతే అనవసరంగా రివ్యూ వృథా అవుతుందని భయం. ఒక వేళ రివ్యూ కోరకపోతే వికెట్ మిస్ అవుతుందేమోనని అదొక టెన్షన్. దీంతో రివ్యూ కోరే సమయాల్లో క్రికెటర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. అక్కడ చాలా తెలివిగా నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ విషయంలో ఆరి తేరాడు. చాలా వరకు అతను తీసుకున్న రివ్యూలు సక్సెస్ అయ్యాయి. దీంతో డీఆర్ఎస్‌కు డెసిషన్ రివ్యూ సిస్టమ్ అని కాక ధోనీ రివ్యూ సిస్టమ్ అని అభిమానులు పేరు మార్చారు. అయితే తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రిషబ్ పంత్ కోహ్లితో రివ్యూ కచ్చితంగా తీసుకోవాల్సిందేనని పదే పదే చెప్పి మనకు ధోనీని గుర్తు చేశాడు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ట్రెంట్ బ్రిడ్జిలో తొలి టెస్టు జరుగుతున్న విషయం విదితమే. అందులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అయితే భారత ఫాస్ట్ బౌలర్ సిరాజ్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీ రెండు సార్లు దొరికాడు. కానీ మొదటి సారి రివ్యూ కోరగా అది ఫెయిల్ అయింది.
Kohli and pant😂😂💥#ViratKohli #ENGvIND #PANT pic.twitter.com/Zq0JQwwWZE
— Trollmama_ (@Trollmama3) August 4, 2021
అయితే రెండోసారి సిరాజ్ వేసిన బంతి క్రాలీ బ్యాట్‌ను ఎడ్జ్ తీసుకుంది. దీంతో వికెట్ల వెనుక ఉన్న పంత్ క్యాచ్ పట్టాడు. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే ఆ సమయంలో కోహ్లికి రివ్యూ కోరాలో వద్దో తెలియలేదు. అంతకు ముందు రివ్యూ విఫలం అయింది కనుక అది కూడా విఫలం అయితే అనవసరంగా రివ్యూను కోల్పోతామని భావించిన కోహ్లి ముందుగా రివ్యూ కోరేందుకు తటపటాయించాడు. కానీ పంత్ మాత్రం పదే పదే కోహ్లితో రివ్యూ కచ్చితంగా కోరాలని చెప్పాడు. దీంతో కోహ్లి రివ్యూ కోరాడు. అయితే రివ్యూలో క్రాలీ బ్యాట్‌కు బంతి తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో అతన్ని అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. ఇక కోహ్లి, పంత్‌లు సంబరం పట్టలేక హై ఫై ఇచ్చుకున్నారు. కాగా ఆ దృశ్యాలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రిషబ్ పంత్‌ను మెచ్చుకుంటున్నారు. అతను ధోనీని గుర్తు చేశాడని కితాబిస్తున్నారు.