ఇంగ్లండ్ గడ్డపై భారత్ చెలరేగింది. టీమిండియా ప్లేయర్లు ఇరగదీశారు. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. బౌలింగ్‌తో మనోళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గడ్డపై నిలువరించారు. ఆ జట్టుతో ట్రెంట్ బ్రిడ్జిలో తొలి టెస్టు మ్యాచ్ బుధవారం ప్రారంభం కాగా.. తొలిరోజు ఆటలో భారత్ పైచేయి సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను భారత బౌలర్లు దెబ్బ తీశారు. తరువాత వరుస సెషన్లలో వికెట్ల పడగొట్టారు. దీంతో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 183 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ జో రూల్ (64 పరుగులు) కొంత సేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయినా భారత బౌలింగ్ ముందు విఫలం అయ్యాడు. ఇక మిగిలిన ఇంగ్లండ్ ప్లేయర్లు ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వలేదు.
భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీయగా, మహమ్మద్ షమీ 3 వికెట్లు తీశాడు. సిరాజ్ కు 1, శార్దూల్ ఠాకూర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు సంయమనంతో ఆడారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, రాహుల్‌లు క్రీజులో ఉన్నారు.