కరోనా: ఆ విషయంలో ఇండియానే టాప్..

ప్రపంచంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రెండవ దేశంగా ఇండియా రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. ఐతే ఎక్కువ మంది కరోనా నుండి రికవరీ అయిన మొదటి దేశంగా ఇండియా గుర్తింపు పొందింది. ప్రపంచ కరోనా రికవరీ జాబితాలో 19శాతానికి పైగా రికవరీ కేసులు ఇండియా నుండే ఉన్నాయి. 43లక్షల మందికి పైగా కరోనా నుండి రికవరీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.

కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన కలుగుతున్న నేపథ్యంలో రికవరీలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. ఇండియా తర్వాత ఎక్కువ మంది కరోనా రికవరీ కేసులు ఉన్న దేశం అమెరికానే. ఆ తర్వాత బ్రెజిల్ మూడవ స్థానంలో ఉంది. అమెరికా ప్రపంచ కరోనా రికవరీ శాతంలో 18.70 శాతంగా ఉంది. కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న దేశాలలో అమెరికానే మొదటి స్థానంలో ఉంది. రికవరీలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకూ ఆగిపోయిన కార్యకలాపాలన్నీ మెల్లమెల్లగా మొదలవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం అవుతున్నాయి. తాజ్ మహల్ సందర్శనానికి నేటి నుండి అనుమతులు లభించిన సంగతి తెలిసిందే.