ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది అనడంలో సందేహం లేదు. మానవ వనరుల రంగంలో నుంచి మొదలుకుంటే పలు రంగాల్లో మన దేశానికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. అంతే కాదండోయ్…
ప్రపంచంలోనే అత్యధికంగా సల్ఫర్‌డై ఆక్సైడ్ (so2)ను వెదజల్లుతూ వాతావరణ కాలుష్యానికి గురవుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని ఓ పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా so2ను విడుదల చేస్తున్న దేశాలపై గ్రీన్‌పీస్ అనే సంస్థ నిర్వహించిన పరిశోధన వివరాలను సోమవారం విడుదల చేసింది. వీటిని ఆధారంగా చేసుకుని నాసా విశ్లేషణ చేసింది. ఓజోన్ మానిటరింగ్ ఉపగ్రహం ద్వారా చేసిన ఈ పరిశోధనలో ప్రపంచంలో భారత్‌లో 15శాతం కంటే ఎక్కువ so2 ను వెదజల్లుతున్న కేంద్రాలు ఉన్నట్లు వెల్లడించింది.
2015లో కేంద్రం మొదటిసారి so2 విడుదల విషయంలో విద్యుత్తు కేంద్రాలకు కొన్ని పరిమితులను విధించింది. విద్యుత్తు తయారీ కేంద్రాల్లో 2017 కల్లా రెట్రోఫిట్ సాంకేతికతను ఉపయోగించాలని తెలిపింది. ఆ తర్వాత విద్యుత్తు శాఖ, విద్యుత్తు కేంద్రాల నిర్వాహకుల అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో దిల్లీ పరిధిలోని ప్లాంట్లకు కేంద్రం ఆ గడువును 2019 డిసెంబర్ వరకు, ఇతర ప్లాంట్లకు 2022 వరకు పొడిగించినట్లు ఎన్‌జీవో నివేదికలో పేర్కొంది. గాలి కాలుష్యంతో ప్రపంచంలో ప్రతి ఏటా 4.2 మిలియన్ మంది ప్రజలు మరణిస్తున్నట్లు నివేదికలో గ్రీన్ పీస్ సంస్థ పేర్కొంది.
దేశంలో ఎక్కువ సల్ఫర్‌డయాక్సైడ్ విడుదలైతున్న ప్రాంతాలు
భారత్‌లో ఎక్కువగా so2 విడుదల చేస్తున్న ప్రదేశాల్లో మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి, తమిళనాడులోని నైవేలీ ఒడిశాలోని జార్సుగూడ, తాల్చేర్, ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా, గుజరాత్‌లోని కచ్, తెలంగాణలోని రామగుండం, మహారాష్ట్రలోని చంద్రాపూర్, కొరాడి ప్రాంతాలు ఉన్నట్లు పేర్కొంది. అదేవిధంగా విశ్లేషణ ప్రకారం భారత్‌లో ఉన్న మొక్కలకు వాయుకాలుష్యాన్ని డీసల్ఫరైజేషన్ చేసే సాంకేతిక లేదని వెల్లడించింది. ప్రధానంగా ఇది థర్మల్ విద్యుత్తు తయారీ కేంద్రాల్లో బొగ్గు, ఇంధనాలు మండించడం కారణంగా వెలువడుతుందని పేర్కొన్నాయి.