భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్ కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. అయినా కొన్ని చోట్ల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అందువల్లే కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు 17వేలకు పైగా మంది కరోనా బారినపడ్డారు.
భారత్‌లో నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు 17,135 మందికి కరోనా వైరస్ నిర్ధరణ కాగా..మరో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 19,823 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.49 శాతానికి చేరింది. భారత్‌లో మంగళవారం 23,49,651 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 204.84 కోట్లు దాటింది. మరో 4,64,919 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 8,21,908 మంది వైరస్ బారినపడగా.. మరో 1,938 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 583,944,874 కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 64,18,751 మంది మరణించారు. ఒక్కరోజే 1,087,782 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 554,463,913కు చేరింది.
జపాన్‌లో 167,678 కేసులు నమోదు కాగా.. 109 మంది మరణించారు. దక్షిణ కొరియాలో తాజాగా 111,700 కేసులు నమోదు కాగా..16 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇటలీలో కొత్తగా 64,861 మందికి కరోనా సోకింది. 190 మంది బలయ్యారు.జర్మనీలో తాజాగా 87,681 మందికి కరోనా సోకింది. 210 మంది మరణించారు.అమెరికాలో కొత్తగా 61,162 మందికి వైరస్ సోకింది.