సహజ నటి జయసుధ..సినీ ఇండస్ట్రీకి ఎంటరై యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన సినీ ప్రయాణం గురించి వివరిస్తూనే సినీ పరిశ్రమపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కె.బాలచందర్, రాఘవేంద్రరావు వంటి దర్శకులతో పని చేసిన అనుభవం గురించి తెలిపింది.
ఈ క్రమంలోనే సినీ పరిశ్రమలో వివక్ష ఉందనే అభిప్రాయం తెలిపింది. ముంబై నుంచి వచ్చే హీరోయిన్స్ ను, ఇక్కడ ఉన్న హీరోయిన్స్ ను ట్రీట్ చేసే విధానంలో తేడా ఉందని పేర్కొంది. తాను ఒక సినిమాకు పని చేస్తున్న క్రమంలో ఎదురైన అనుభవం షేర్ చేసింది. తన సూట్ కేసుల కోసం ఇంకో రూమ్ కేటాయించాలని అడిగితే స్పందించని వారు..ముంబై నుంచి వచ్చిన హీరోయిన్ రేఖ ..డాగ్ కోసం, హెయిర్ స్టైలిస్ట్ కోసం సెపరేట్ రూమ్ లు కేటాయించారని వివరించింది.
చిత్ర పరిశ్రమలో అలా ముంబై నుంచి వచ్చిన వారికి ప్రయారిటీ ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఇకపోతే హీరోలను డెమిగాడ్స్ గా ట్రీట్ చేయడం గురించి కూడా తన అభిప్రాయం తెలిపింది. అయితే, హీరోలు నార్మల్ గానే ఉంటారని, కానీ, వారి పక్కన ఉన్న వారే వారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారని అభిప్రాయపడింది. హీరోలు డ్యాన్స్ మూమెంట్స్ సరిగా చేయకపోతే డ్యాన్స్ మాస్టర్స్ వారికి కాకుండా హీరోయిన్స్ కు చెప్పడం కూడా సరికాదని తెలిపింది. తనకు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని వివరించింది.
ఇన్నేళ్ల తన సినీ ప్రయాణంలో తను వేషాల కోసం ఎప్పుడూ ఎవరినీ అడగలేదని, తన వద్దకు అవకాశాలు వచ్చాయని స్పష్టం చేసింది సహజ నటి జయసుధ. తన మేనత్త విజయ నిర్మల వలన తనకు సినిమాల్లో నటించాలనే ఆలోచన వచ్చిందని చెప్పింది. చిన్నప్పుడు తనను సినిమాల షూటింగ్స్ కు విజయ నిర్మల తీసుకెళ్లిందని పేర్కొంది జయసుధ.