దేశ సమగ్రతకు, పౌరుల డేటాకు ముప్పు పొంచి ఉందని చెప్పి భారత ప్రభుత్వం ఇప్పటికే చైనాకు చెందిన 224 యాప్‌లను బ్యాన్ చేసిన విషయం విదితమే. అయితే ఇకపై చైనా మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీదారులపై కూడా కేంద్రం కొరడా ఝలిపించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ డేటా ప్రైవసీ, సెక్యూరిటీపై సెప్టెంబర్ 19న జరగనున్న సమావేశంలో అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆ అనుమతులు ఇస్తే దేశంలో మొబైల్ హ్యాండ్ సెట్లను విక్రయిస్తున్న చైనా కంపెనీలకు నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి.
మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీదారులు ఆ ఫోన్లను వాడే వినియోగదారులకు చెందిన డేటాను భద్రంగా ఉంచాల్సి ఉంటుంది. కంపెనీలే అందుకు బాధ్యత వహించాలి. 2018లోనే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈ మేరకు ప్రతిపాదనలు పంపింది. అయితే ట్రాయ్ ప్రతిపాదనలను అమలు చేసే పక్షంలో మొబైల్ హ్యాండ్ సెట్లను తయారు చేసే చైనా కంపెనీలు వినియోగదారుల డేటాను స్టోర్ చేసేందుకు భారత్‌లోనే సర్వర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం దేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో చైనా కంపెనీల వాటా 74 శాతంగా ఉంది.
అయితే మొబైల్ హ్యాండ్ సెట్లను తయారు చేసే కంపెనీలకే నిబంధనలను విధించాలని, ట్విట్టర్, ఫేస్‌బుక్ తదితర యాప్స్‌కు నిబంధనలు విధించాల్సిన అవసరం లేదని ట్రాయ్ అభిప్రాయపడింది. ఆయా యాప్స్‌పై ప్రస్తుతానికి ఎలాంటి ఆంక్షలను విధించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే కేంద్రం చైనా హ్యాండ్ సెట్ల తయారీదారులపై ఎలాంటి ఆంక్షలను విధిస్తుందనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.