జీవితమంటే కష్టసుఖాల సమరం. నిజంగా కొన్ని కొన్ని రోజులని చూస్తూ ఉంటే ఈ జీవితం ఎందుకు రా బాబు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అటువంటి సమయంలో కుంగిపోకూడదు, వెనుకడుగు వేయకూడదు. కేవలం నమ్మకంతో ముందుకు దూసుకెళ్లి పోవాలి. అప్పుడు ఎంతటి కష్టమైనా సరే వెనక్కి పారిపోతుంది. ఇండియన్ ఫెన్సర్ భవానీ దేవీ (సీ.ఏ భవాని దేవి) నిజంగా ఎందరికో ఆదర్శం.
ఈమె క్రీడలన్నిటి కంటే భిన్నంగా ఉండే ఫెన్సింగ్ ని ఎంచుకుంది. కేవలం ఎంచుకోవడం మాత్రమే కాదు దానిలో రాణించింది. తొలి భారత ఫెన్సర్ గా ఆమె చరిత్రను సృష్టించింది. నిజంగా ఈమె కష్టాలను చూస్తే ఎవరైనా కంటతడి పెట్టుకుంటారు. చదలవాడ ఆనంద సుందర రామన్ భవాని దేవి చెన్నైలో జన్మించింది. ఈమె తండ్రి ఒక ఆలయంలో పూజారి. భవాని దేవి తల్లి గృహిణి.
ఈమె పదకొండేళ్ల వయసులో ఉన్నప్పుడు ఫెన్సింగ్ పై ఆకర్షితురాలైంది. పదకొండేళ్ల వయసులో ఫెన్సింగ్ కి ఆకర్షితులైన భవాని దేవి ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ 2020 వరకు రాగలిగింది. పద్నాలుగేళ్ళ వయసులో ఉన్నప్పుడు భవాని దేవి టర్కీలో జరిగిన పోటీల్లో తొలి సారిగా భారత్ తరఫున అంతర్జాతీయ క్రీడలలో పాల్గొంది. అయితే ఆమె మూడు నిమిషాలు ఆలస్యంగా వెళ్లడం వల్ల టోర్నీ నుంచి ఆమెని నిష్క్రమించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే మలేషియాలో జరిగిన కామన్ వెల్త్ ఛాంపియన్షిప్ 2019 లో పాల్గొన్న భవానీదేవి తొలిసారిగా పతకం సాధించడం జరిగింది.
అలానే 2010లో ఇంటర్నేషనల్ ఓపెన్, క్యాడెట్ ఏషియన్ చాంపియన్ షిప్ 2010, కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 2021 ఇలా ఎన్నో విజయాల్ని పొందింది. తన కెరీర్ లో మొత్తం తొమ్మిది నేషనల్ టైటిల్స్ ని సాధించింది. అయితే ఈమె జీవితంలో కేవలం విజయాలు మాత్రమే ఉన్నాయి అనుకుంటే పొరపాటు. ఈమె తన చిన్ననాటి వయసులో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలని చవి చూసింది. ఈమెకి పదకొండేళ్ల ఉన్నప్పుడు తొలిసారి స్కూల్లో ఫెన్సింగ్ ని ఎంచుకోవడం జరిగింది ఆమెకి ఫెన్సింగ్ పై రోజు రోజుకీ ఆసక్తి కూడా పెరిగింది.
అయితే ఈ క్రీడని ఎంచుకున్న ప్రతి ఒక్కరు కూడా మధ్యలోనే ఆగిపోయేవారు. కానీ ఈమె మాత్రం ఇష్టాన్ని పెంపొందించుకుంది. అయితే మొదటి సారి తనకి ఫెన్సింగ్ కిట్ కొనడానికి డబ్బులు లేవు. దీనితో భవాని దేవి తల్లి ఆరువేల రూపాయలు నగలు అమ్మ ఇచ్చింది. అలానే స్పాన్సర్లు కోసం ఎంతగానో వెతికేవారు.
2013లో విదేశీ పర్యటనల ఖర్చు భరించే స్తోమత లేకపోవడంతో మధ్యలోనే ఫెన్సింగ్ ని వదిలేద్దాం అనుకుంది. అప్పటికే పది లక్షల రూపాయల వరకు లోన్ తీసుకున్నారు. అందుకని ఈమె తన తల్లి తో ఇంతకంటే దీన పరిస్థితి వద్దు అని చెప్పేసింది. కానీ తన తల్లి మాత్రం భవానీ దేవిని ఎంతగానో నమ్మి ఓదార్చారు.
కఠోర సాధన చేసి 2014లో ఏషియన్ చాంపియన్ షిప్ లో పెన్సింగ్ విభాగంలో తొలి పతకం పొందింది. ఇలా ఈమె భారత ప్లేయర్ గా చరిత్ర సృష్టించారు. అయినా ఈమెకి ఈ కష్టాలు తప్పలేదు. రోజు రోజుకి ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తోంది. విదేశీ టోర్నీకి వెళ్లడానికి డబ్బులు లేవు అప్పుడు ఈమె సీఎం జయలలిత కి లేఖ రాశారు. దీనితో ఆమె ఖర్చులకి డబ్బులు ఇచ్చారు.
ఆ తర్వాత ఈ మధ్య కాలంలో పది లక్షలు లోన్ కట్టడం, ఇల్లు కొనుక్కోవడం లాంటివి చేశారు అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి.. కష్టం వస్తే నమ్మకం పెట్టుకుని ప్రయత్నం చేస్తూ ఉండాలి అంతే కానీ మధ్యలో వదిలేయడం లేదా నా వల్ల ఏమవుతుంది అని తక్కువగా చూసుకోవడం లాంటివి చేయొద్దు. ఒకసారి ఓటమి వస్తే మరొక సారి గెలుపు ఉంటుంది అని దానికి తగ్గ కృషి, ప్రయత్నం, సాధన ఉండాలి. పట్టుదల విడవకుండా అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి…