భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రత గురించి చేసిన వ్యాఖ్యలు ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయ్యాక రక్షణ శాఖ మంత్రి మాట్లాడిన మాటలు, జాతీయ భద్రత విషయంలో ఎలా ఉండనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ, రాజ్ నాథ్ సింగ్ ఏమన్నారంటే, జాతీయ భద్రతకు సవాళ్ళు పెరుగుతున్నాయని, ఆ సవాళ్ళు సంక్లిష్టంగా మారుతున్నాయని, దానివల్ల వాటిని ఎదుర్కునేందుకు స్వావలంబన అవసరం అని అన్నారు.
కొత్త కొత్త రక్షణ సవాళ్ళు పుట్టుకొస్తున్న నేపథ్యంలో భారత్ రక్షణ విభాగంలో మరింత దృఢంగా ఉండాల్సిన అవసరం ఉందని, సాంకేతికత, ఇతరత్రా విషయాల్లో ముందంజలో ఉండాలని రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో వేగంగా మార్పులు వస్తున్నాయని, వాటిని వేగంగా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా సాంకేతికతను అభివృధ్ధి చేయాలని అన్నారు.