అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ మూలాలున్న మహిళలు సత్తా చాటారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అరుణ మిల్లర్ మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఇండో అమెరికన్ నబీలా సయ్యద్ హిస్టరీ క్రియేట్ చేశారు. 23 ఏళ్లకే ప్రతినిధుల సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు.
మధ్యంతర ఎన్నికల్లో భాగంగా ఇల్లినాయిస్ 51వ డిస్ట్రిక్ నుంచి ప్రతినిధుల సభకు నబీలా ఎన్నికయ్యారు. రిపబ్లిక్ పార్టీకి చెందిన క్రిస్ బోస్‌పై ఆమె గెలుపొందారు. ఈ ఎన్నికల్లో నబీలాకు 52.3శాతం ఓట్లు వచ్చాయి. తన ఆనందాన్ని ఆమె ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘‘ నా పేరు నబీలా సయ్యద్. నాకు 23 ఏళ్లు. ఇండో-అమెరికన్ ముస్లిం మహిళని. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించాను. ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీ నుంచి నేనే పిన్నవయస్కురాలని ’’ అని పోస్టు చేశారు.
డెమోక్రాటిక్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నానని తెలిసిన తర్వాత ప్రజలతో మాట్లాడేందుకే ఎక్కువ సమయం కేటాయించానని నబీలా సయీద్ తెలిపారు. ఈ పోటీలో ఎందుకు పాల్గొంటున్నానో వివరించానని తెలిపారు. మెరుగైన నాయకత్వం కోసం సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. ప్రజలతో మమేకమవ్వడం వల్లే విజయం సాధించినట్లు చెప్పుకొచ్చారు.
My name is Nabeela Syed. I’m a 23-year old Muslim, Indian-American woman. We just flipped a Republican-held suburban district.
And in January, I’ll be the youngest member of the Illinois General Assembly.
— Nabeela Syed (@NabeelaforIL) November 9, 2022