కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. నాందేడ్ కు చేరుకున్న ఈ యాత్రలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ మాట్లాడుతుండగా ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం చోటుచేసుకుంది. ఆయన ఏదో చెబుతుండగా సడెన్ గా మైక్ ఆఫ్ అయింది.. మళ్లీ క్షణాల్లోనే ఆన్ అయింది. అయితే రాహులే కావాలని మైక్ ఆఫ్ చేసి ఆన్ చేశారు. పార్లమెంటులో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నప్పుడు బీజేపీ ఇలాగే ప్రవర్తిస్తోందని రాహుల్ చెప్పారు.
‘‘ స్విచ్ కంట్రోల్స్ ప్రస్తుతం నా చేతుల్లో ఉన్నాయి కాబట్టి సరిపోయింది. పార్లమెంట్‌లో ఇలా జరిగితే ఏం చేయగలం? 2016లో నోట్ల రద్దు గురించి మాట్లాడితే మైక్ ఆఫ్..భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోందని పార్లమెంటులో గొంతు వినిపిస్తుంటే మైక్ ఆఫ్. మేం ఏం మాట్లాడినా ప్రజలు దానిని వినకుండా అడ్డుకుంటున్నారని, అందుకే భారత్ జోడో యాత్రలో తమ గొంతు వినిపిస్తూ, అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం’’ అని రాహుల్ అన్నారు.