ఒకప్పుడు పేషెంట్.. ఇప్పుడు సెలబ్రిటీలకు ఆరోగ్య పాఠాలు చెబుతోంది

-

మన పెద్దవాళ్లు అనుభవాలే పాఠాలు అని ఊరికే అనలేదు. మన జీవితంలో అనుభవించిన కష్టాలు, సమస్యలు మనకు కొన్నిసార్లు మంచే చేస్తాయి. మనకు ఎదురయ్యే ప్రతికూలతలే కొన్నిసార్లు మనం ఎదగడానికి కావాల్సిన ఆలోచనలను మనలో రేకెత్తిస్తాయి. మనకు ఉన్న అవసరాలే కొన్నిసార్లు మనలో ఆలోచనలను కలిగిస్తాయి. ఈ మాటలు సెలిబ్రిటీ హెల్త్ కోచ్ పాయల్ కొఠారీ జీవితానికి కరెక్ట్ గా సరిపోతాయి. చిన్న వయస్సు నుంచి అనారోగ్యాలను ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు సెలిబ్రిటీలకే ఆరోగ్య పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగింది. ఇంతకీ పాయల్ ప్రయాణం అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడం నుంచి ఆరోగ్యపాఠాలు చెప్పే వరకు ఎలా సాగిందో తెలుసుకుందామా..?

మనం తినే ఫుడ్ మీదనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇది వైద్యులు చెప్పే మాట. కానీ ఈ విషయం ఆలస్యంగా తెలుసుకుంది పాయల్ కొఠారీ. కోల్ కతాలో పుట్టి ముంబయిలో పెరిగిన పాయల్ కు రెండేళ్ల వయస్సులోనే ట్యూబర్ క్యులోసిస్ (టీబీ) ఉందని తేలింది. నెమ్మదిగా ఆ సమస్య నుంచి బయటపడింది కానీ దాని కోసం తీసుకున్న మందుల వల్ల తన ఆరోగ్యం దెబ్బతిని లీకీ గట్ సిండ్రోమ్ బారిన పడింది. దీనివల్ల పాయల్ చాలా సన్నబడింది.

ఓవైపు అనారోగ్య సమస్యలు మరోవైపు తన శారీరక స్థితి ఆకర్షణీయంగా లేకపోవడం వల్ల పాయల్ టీనేజ్ లోనే డిప్రెషన్ కు గురైంది. దీనివల్ల అనారోగ్యకరమైన ఫుడ్ కు బానిసై అధిక బరువు పెరిగింది. తాను సన్నగా ఉన్నప్పుడు ఎలా గేలి చేసేవారో లావయ్యాక కూడా హేళన చేయడం మానలేదని పాయల్ బాధపడింది. తనను గేదె అని పిలిచే వారని.. నెమ్మదిగా ఆ మాటలు తనను డిప్రెషన్ కు లోనయ్యేలా గురిచేశాయని తెలిపింది. ఆ సమయంలో తనకు అండగా నిలిచిన తల్లి.. తనకు నచ్చిన దారిలో వెళ్లేలా ప్రోత్సహించిందని పాయల్ చెప్పింది. అమ్మ మాటలు తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని.. ఈరోజు తాను ఇంత ఫేమ్ సంపాదించానంటే అంతా తన తల్లి వల్లేనని అంటోంది పాయల్.

డిప్రెషన్ లో ఉన్న నన్ను అమ్మ డాక్టర్ వద్దకు తీసుకెళ్లింది. అక్కడే మనిషి ఫిజికల్, మెంటల్ స్థితులు జీర్ణవ్యవస్థపై డిపెండ్ అయి ఉంటాయని తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఆరోగ్యం గురించి పుస్తకాలు చదవడం ప్రారంభించాను. మా అమ్మ సాయంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకున్నాను. డాక్టర్‌ని కలిశాక ఆరోగ్యం గురించి ఓ చిన్నపాటి పరిశోధనే చేశా. ఏ అనారోగ్యమైనా జీర్ణ వ్యవస్థ నుంచే ప్రారంభమవుతుందని తెలుసుకున్న నేను.. నా మనసును, ఆలోచనల్ని మార్చుకున్నా. బరువు తగ్గడం పైనే పూర్తి దృష్టి పెట్టా. నా టైంటేబుల్ మొత్తం మార్చేశా. నిమ్మరసం, అల్లం వేసి మరిగించిన నీళ్లు తాగేదాన్ని. కిచిడీ, నెయ్యి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి కోరు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు.. వంటి వాటికి ప్రాధాన్యమిచ్చా. వీటితో పాటు రోజూ గంట సేపు పరిగెత్తడం అలవాటు చేసుకున్నా. ఇవన్నీ డిప్రెషన్‌ని దూరం చేసి నా ఆరోగ్యాన్ని పెంపొందించడంలో దోహదం చేశాయి..’ అంటోంది పాయల్‌.

తనంతతానే తిరిగి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్న పాయల్.. తనలా బాధపడే మరెంతోమందిలో స్ఫూర్తి నింపాలనుకుంది. ఈ ఉద్దేశంతోనే అమెరికాలో క్లినికల్‌ న్యూట్రిషన్‌ విభాగంలో కోర్సులు పూర్తి చేసింది. ఆ లోపే వివాహం కావడంతో తన భర్త ఉద్యోగ రీత్యా హాంగ్‌కాంగ్‌లోనే 15 ఏళ్ల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సమయాన్ని తన ఇద్దరు పిల్లల ఆలనా పాలనలోనే గడిపేసిందామె. ఆ తర్వాత ఇండియాకు తిరిగొచ్చిన పాయల్‌ను చూసి అందరూ ఒకింత ఆశ్చర్యపోయారు.

‘ఇండియాకు తిరిగొచ్చాక అందరూ ‘నువ్వు ఇంత ఫిట్‌గా, అందంగా ఎలా మారావ్‌? నీ డైట్‌ సీక్రెట్‌ మాతో చెప్పొచ్చుగా?!’ అని అడిగేవారు. ఇలా వాళ్ల సందేహాలు తీర్చే క్రమంలోనే- జీర్ణ వ్యవస్థ పని తీరు, ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం గురించి సరైన అవగాహన కలిగించడం కోసం ‘గట్‌ కోచ్‌’గా మారితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. 2016 నుంచి ఆ ప్రయాణం ప్రారంభమైంది. ఏదైనా కొత్త విషయం/ఉత్పత్తి గురించి ఇతరులకు చెప్పే ముందు నేను ప్రయత్నించి పరీక్షించడం నాకు అలవాటు. ఇతరులకు సలహాలిచ్చే క్రమంలోనూ ఇదే పద్ధతిని పాటిస్తున్నా..’ అంటోంది పాయల్‌.

ప్రస్తుతం లక్షల మందికి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం గురించిన సలహాలు అందిస్తోన్న పాయల్‌ క్లైంట్స్‌ జాబితాలో షమితా శెట్టి, నియా శర్మ, అమితాబ్‌ బచ్చన్‌.. వంటి తారలెందరో ఉన్నారు. అంతేకాదు.. మరోవైపు స్కూళ్లు, లేడీస్‌ క్లబ్స్‌, వివిధ స్వచ్ఛంద సంస్థల్లోనూ ఈ అంశంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోందామె. ఇక గతేడాది నుంచి ‘ఆన్‌లైన్‌ న్యూట్రిషన్‌ స్కూల్‌’ ప్రారంభించి.. ఈ వేదికగానూ ఆరోగ్య పాఠాలు బోధిస్తోందామె. తన గత అనుభవాలు, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం కోసం పాటించే చిట్కాల్ని రంగరించి ‘ది గట్‌’ పేరుతో ఓ పుస్తకం కూడా రాసింది పాయల్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version