ఆ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు షాక్.. విద్యార్థులతో ‘ప్రైవేట్‌’గా పరీక్షలు

-

తెలంగాణలో అనుబంధ గుర్తింపు పొందని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలకు ఇంటర్ బోర్డు షాక్ ఇచ్చింది. వాటి ఆట కట్టించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందుకనువుగా వాటిలో చదివే విద్యార్థులతో ప్రైవేట్‌గా పరీక్షలు రాయించాలని భావిస్తోంది. ఇప్పటికీ 200 కళాశాలల అఫిలియేషన్‌ ప్రక్రియ పెండింగ్‌లో ఉండగా.. హైదరాబాద్‌లోని మరో 340కి పైగా కళాశాలలు గృహ, వాణిజ్య సముదాయాల్లో కొనసాగుతున్నాయి.

ఇందులో చాలా వాటికి అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) రానందున బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఈ కళాశాల విద్యార్థులు ఇంటర్‌బోర్డు లెక్కల్లోకి రారు. ఒకవేళ వాటికి ఈ ఏడాదికి మినహాయింపు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏటా ఇలా అనుమతి ఇస్తూపోతే ఇంక ముగింపు ఎప్పుడని బోర్డు ఇన్‌ఛార్జి కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ భావిస్తున్నట్లు సమాచారం. వాటికి ఈ విద్యా సంవత్సరం అనుమతి ఇవ్వకుండా.. అదే సమయంలో వాటిలో చదివే దాదాపు లక్ష మంది విద్యార్థులను ప్రైవేట్‌గా పరీక్షలు రాయించాలని ఆయన భావిస్తున్నారు. ఈనెల 11న ఇంటర్‌బోర్డు పాలక మండలి సమావేశంలో దీనిపై చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news