హరీశ్ వన్ మ్యాన్ షో పై టీఆర్ఎస్ నేతల ఆసక్తికర వ్యాఖ్యలు

-

తెలంగాణలో ఎక్కడ..ఎప్పుడు ఉపఎన్నిక జరిగినా గెలుపు మాత్రం టీఆర్ఎస్‌దే అన్నట్లు ఉండేది పరిస్థితి. తొలిసారి బైపోల్‌లో అధికార పార్టీ బోల్తా పడింది. అయితే క్యాంపెయినింగ్‌లో వన్‌మ్యాన్‌ షో పార్టీ కొంపముంచిందనే విశ్లేషణలు చేస్తున్నారు కొందరు టీఆర్ఎస్ నేతలు. ఉప ఎన్నిక ఫలితం టీఆర్‌ఎస్‌ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. రెండు దశాబ్దాలుగా టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న దుబ్బాకలో ఓటమి చెందడం ఆ పార్టీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేపోతున్నారు.

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీ సిట్టింగ్‌ స్థానంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. తొలిసారిగా చట్టసభకు ఎన్నికయ్యారు. ఇరు పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ విజయ బావుటా ఎగరేసింది. అభ్యర్థి ఎంపికపై తొలినుంచి వ్యూహత్మకంగా వ్యవహరించారు సీఎం కేసీఆర్‌. అందరూ ఊహించిన విధంగానే సోలిపేట సుజాతను బరిలో నిలిపారు. స్థానిక అభ్యర్థి కావడంతోపాటు సానుభూతి కూడా కలిసొస్తుందని భావించారు. దుబ్బాక చుట్టూ సిరిసిల్ల, గజ్వేల్‌, సిద్దిపేట వంటి స్థానాల్లో కేటీఆర్‌, సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌ రావు ఉండటంతో ఉపఎన్నికలో విజయం ఖాయమనుకున్నారు.

ప్రచార బాధ్యతలన్నీ మొదటి నుంచి మంత్రి హరీష్‌ రావు దగ్గరుండి చూసుకున్నారు. దుబ్బాక అభివృద్ధి తన బాధ్యతంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు కేవలం​ ఓట్ల సమయంలోనే ప్రజల్లో కనిపిస్తారని, దుబ్బాక అభివృద్ధికి టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని అభ్యర్థించారు. బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సుజాత బరిలో నిలవడం రఘునందన్‌కు కొంచెం అనుకూలంగా మారింది. సుజాతను గెలిపిస్తే దుబ్బాక వచ్చే నిధులు కూడా సిద్దిపేట, సిరిసిల్లకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు చేసిన ప్రచారం బాగా వర్కౌట్‌ అయ్యింది.

మంత్రి హరీష్‌రావు దాదాపు రెండు నెలలకు పైగా అక్కడే మకాం వేసినప్పటికీ..ఫలితాలు తారుమారయ్యాయి. ఇది ఆ పార్టీ నేతలకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా గుర్తింపు పొందిన దుబ్బాక గడ్డపై కాషాయ జెండా ఎగరడం అంత సామాన్య విషయం కాదు. దాదాపు లక్ష మెజార్టీ ఖాయమని టీఆర్‌ఎస్‌ నేతలు తొలి నుంచీ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రచారంలో హరీష్‌రావు అనేక మార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయినప్పటికీ ఉత్కంఠ పోరులో చివరికి విజయం బీజేపీనే వరించింది.

ఉప ఎన్నికల్లో హరీశ్ ను ఒక ట్రంప్‌ కార్డుగా ఉపయోగించిన సందర్భాలు చాలా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో.. పార్టీ బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణలో దగ్గరుండి మరీ తమ అభ్యర్థులను గెలిపించారు. అలాంటి నాయకుడి నేతృత్వంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫలితం టీఆర్‌ఎస్ కు ఊహించని షాకిచ్చింది. ఓటర్లు ఇచ్చిన తీర్పు హరీశ్‌రావుకు వ్యతిరేకం అని భావించకున్నా.. ఈ ఫలితం వ్యక్తిగతంగా ఆయనకు కొంత ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news