గత కొద్ది రోజులుగా జైలు జీవితం గడుపుతున్న రిపబ్లిక్ టీవీ ఛీఫ్ ఎడిటర్, ఆర్నబ్ గోస్వామికి బెయిల్ లభించింది. ఒక డిజైనర్ ఆత్మహత్య కేసులో ఎనిమిది రోజుల క్రితం ఆయన అరెస్టయ్యారు. అయితే ఈరోజు సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం అందుతోంది. ఆయనతో పాటు సహా నిందితుడికి కూడా బెయిల్ ఇచ్చింది సుప్రీం కోర్టు. 2018లో వ్యక్తి ఆత్మహత్య కేసులో బాంబే హైకోర్టు తన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన వెంటనే అర్నబ్ గోస్వామి సుప్రీం కోర్టును నిన్న ఆశ్రయించారు.
వెంటనే ఇవాళ ఉదయం 10.30 గంటలకే ఈ కేసు లిస్ట్ చేసింది సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ కార్యాయలయం. అర్నబ్ గోస్వామి పిటిషన్ ని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. అయితే మరోవైపు అనేక కేసులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటే రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామి కేసును అర్జంట్ గా ఒక్క రోజులోనే ఎలా లిస్ట్ చేశారని సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌ను సీనియర్ లాయర్ దుష్యంత్ దవే ప్రశ్నించడం కూడా ఈ ఉదయం వివాదంగా మారింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో దీపావళి సెలువులు కొనసాగుతున్నాయి. అలాంటి సమయంలో కూడా ఈయన కేసు విచారణకు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.