ఎన్నికల్లో శ్రీవారి లడ్డు ప్రసాదం పంపిణీ పై ఆసక్తికర చర్చ

-

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు డబ్బు పంచితే..మరికొందరు గిఫ్ట్స్‌ ఇస్తుంటారు. కానీ, ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటన.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. పరమపవిత్రమైన శ్రీవారి లడ్డూను పంచడం.. రాజకీయాలకు వేదికగా మారింది. అసలు అన్ని లడ్డూలు.. సర్పంచ్‌ అభ్యర్థులకు ఎలా వచ్చాయి అన్నదానిపై ఆసక్తికర చర్చ నడుస్తుంది.

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. తిరుమలకు వచ్చే భక్తులు.. దర్శనం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది లడ్డూ ప్రసాదానికే. ఇప్పుడు ఇదే లడ్డు ప్రసాదం ద్వారా ఒటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. శ్రీవారి లడ్డూలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి వైసీపీ మద్దతుదారులు చేసిన ప్రయత్నంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి రాజకీయ వేడి కొనసాగుతోంది. ఏకగ్రీవాల నుంచి అనేక అంశాలపై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలోని పలు పంచాయతీలలో ఓటర్లకు లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారని.. అది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేషన్ పంపిణీ వాహనాల ద్వారా జరగడమన్నది హాట్‌టాపిక్‌గా మారింది. స్వామి వారి భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదాలు.. ఓటర్లకు ఏ విధంగా సమకూర్చారనేది అంతుచిక్కడంలేదు.

ప్రస్తుతం తిరుమలకు దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇలాంటి సమయంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు..స్వామివారి లడ్డూ ప్రసాదాలు వేలాదిగా ఎలా వచ్చాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలపై ఎలాంటి నియంత్రణ లేకపోయినప్పటికీ.. స్వామివారి లడ్డూ ప్రసాదాలను భక్తులు పదుల సంఖ్యలోనే కొనుగోలు చేస్తూ ఉంటారు. అటువంటిది వేలాదిగా లడ్డూలు కొనుగోలు చేయాలన్నా.. వాటిని తిరుమల నుంచి తరలించాలన్నా అటు టీటీడీ విజిలెన్స్ కాని..ఇటు పోలీస్ శాఖలకు కాని పసిగట్టలేని పరిస్థితి ఉందా అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లకు లడ్డూల పంపిణీ వివాదం.. సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి చుట్టుకుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు తన ఇంటికి శ్రీవారి ప్రసాదాలను తీసుకు వచ్చారాని.. వాటిని తనతో ఉన్న అనుచరులకు పంపిణి చేసానని చెప్పారాయన. తనపై ఆరోపణలు చెయ్యడం సమంజసం కాదని, చంద్రబాబు తాను కలసి చదువుకున్నా..తాను ఇప్పటికీ పేదవాడినే అని వివరణ ఇచ్చుకున్నారు నారాయణస్వామి. డిప్యూటీ సీఎం వివరణ ఇచ్చినా ప్రతిపక్షాలు మాత్రం దీనిపై మండిపడుతూనే ఉన్నాయి. మొత్తానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇప్పుడు రాజకీయాలకు వేదికగా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news