రాజకీయాల్లో గతాన్ని మరిచిపోవడం నాయకులకు రివాజుగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు ఒకవిధం గా అధికారం కోల్పోయాక మరోవిధంగా వ్యవహరించడం వారికి షరా మామూలే అన్నవిధంగా పరిస్థితులు మారాయి. ముఖ్యంగా ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఏడు మాసాల కిందట అధికారంలోనే ఉంది. మరి అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత అప్పటి సీఎం చంద్రబాబు ఎలా వ్యవహరించారు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అనే ప్రశ్నను ఓ వర్గం ప్రజలు సందిస్తున్నారు. నాడు ఆందోళనలన్నా.. నిరసనలన్నా కూడా ఉవ్వెత్తున ఎగిరి పడిన చంద్రబాబు.. కమ్యూనిస్టులకు, ప్రతిపక్షానికి పనిలేక ఉద్యమాలు చేస్తున్నా రని వ్యాఖ్యానించారు.
పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వాప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి వ్యతిరేకంగా అక్కడి రైతులు ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమానికి దిగారు. అయితే, దీనిని అణిచి వేసేందుకు చంద్రబాబు శాయశక్తులా ప్రయత్నించారు. అప్రకటిత కర్ఫ్యూను ఆ గ్రామాల్లో అమలు చేశారని జాతీయ మీడియా ఘోషించింది.(బాబు అనుకూల మీడియా పాత్రికేయ ధర్మాన్ని పాటించి దీనిని వదిలేసిందనుకోండి) అప్పట్లో రైతులను, ఈ ఉద్యమాలతో సంబంధం లేనివారిని సైతం పోలీసులు అర్దరాత్రుళ్లు ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేసిన సంగతిని బాబు అప్పుడే మరిచిపోయారు. ఇక, అప్పటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్ .. ప్రత్యేక హోదా కోసం విశాఖలో విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ తలపెట్టినప్పుడు వారికి సంఘీ భావం ప్రకటించాలని అనుకున్నారు.
ఈ క్రమంలో ఆయన విశాఖకు వెళ్లినప్పుడు కనీసం ఎయిర్ పోర్టు నుంచి కూడా బయటకు రాకుండా అడ్డుకు న్నది ఎవరో ఏ ప్రభుత్వమో బాబు మరిచిపోయారు. రాజధానిలో బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా మంగళగిరి రైతులు ఆందోళన చేసినప్పుడు మఫ్టీలో పోలీసులను పంపించిన విషయాన్ని అప్పుడే మరిచిపోవడం బాబుకుమాత్రమే తెలిసిన విద్యగా చెబుతున్నారు ఇక్కడి రైతులు. అంగన్ వాడీ కార్యకర్తలు తమ వేతనాలు చెల్లించాలని కోరుతూ విజయవాడ ధర్నాకు పిలుపునిచ్చిప్పుడు ఎక్కడికక్కడ కమ్యూనిస్టు నేతలను గృహనిర్బంధాలు చేసిన విషయాన్ని సైతం బాబు తెరమరుగు చేశారు. ఇక, కాపుల ఉద్యమం గురించి, దీనిని అణిచేసేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాల గురించి ఎంత తక్కువ చెప్పుకొన్నా ఎక్కువే!
వీటికి అతీతంగా తనకు, తన ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుందని అనుకున్నారో లేక.. ప్రజాస్వామ్యం లో నిరసన హక్కును కాపాడాలని అనుకున్నారో.. ప్రస్తుత సీఎం జగన్ ఆందోళనలకు అనుమతులు ఇస్తున్నారు. అయితే, దీనిని ప్రభుత్వ అలుసుగా భావించడం, తామేదో పైచేయి సాధించామని అనుకోవడం బాబుకే చెల్లిందనే భావన ఓ వర్గం ప్రజల్లో వస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతాన్ని బాబు మరిచిపోయినా.. ప్రజలు ఇంకా మరిచిపోలేదనే విషయాన్ని గుర్తిస్తే మంచిదని అంటున్నారు.