అంతర్జాతీయ ప్రయాణీకుల లెక్కలు సరిపోవడంలేదు – కేంద్రం

-

భారత్‌లో కరోనా వ్యాప్తికి కారకులైన అంతర్జాతీయ ప్రయాణీకులు ఉద్దేశపూర్వకంగానే అజ్ఞాతంలో ఉంటున్నట్లు ప్రభుత్వాలు అనుమానిస్తున్నాయి.

 

 

గత రెండు నెలలుగా దాదాపు 15 లక్షలమంది విదేశాలనుండి భారత్‌కు చేరుకున్నట్లు కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. వీరందరి కదలికలను పర్యవేక్షణలో ఉంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు కొంత నిర్లిప్తంగా ఉండటంతో ప్రస్తుతం లెక్క సరిపోవడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న అంతర్జాతీయ ప్రయాణీకుల మొత్తం, కేంద్రం వద్ద ఉన్న సమాచారంతో ఏమాత్రం సరిపోవడంలేదని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తేడా మనకు ప్రాణాంతకం కావచ్చని హెచ్చరించింది. వందల సంఖ్యలో విదేశీ ప్రయాణీకులు ‘మిస్‌’ కావడమంటే, పరిస్థితిని మరింత జటిలంగా మారడమేనని క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా రాష్ట్రాలను అప్రమత్తం చేసారు. ఈమేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసారు.

రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి, సమన్వయంతో, స్థిరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాల నిఘా కన్నుగప్పి తిరుగుతున్న అనుమానితులను వెంటనే తమ నిఘా పరిధిలోకి తేవాలని కేంద్రం తేల్చిచెప్పింది. బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ ఇచ్చిన సమాచారం మేరకు 15 లక్షలకు పైగా ప్రయాణీకులు విదేశాలనుంచి భారత్‌ వచ్చారు. ప్రస్తుతం అందరూ అందుబాటులో లేనట్లు రాష్ట్రాలు ఇస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

 

భారత్‌లో కొవిడ్‌-19 విజృంభణ కేవలం విదేశీ ప్రయాణీలకుల వల్లే జరుగుతోందని, స్థానిక వ్యాప్తి చాలా తక్కువ స్థాయిలో ఉందని కేంద్రం తెలిపింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇలా విదేశాలనుంచి వచ్చినవారిని వదిలేయడం ఆత్మహత్యాసదృశమేనని గౌబా ఆందోళన వెలిబుచ్చారు. వెంటనే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వారందరిని తమ నిఘాచత్రం కిందకి తెచ్చుకోవాలని సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news