రువాండా రాజధాని కిగాలీతో పాటు ఉత్తర, పశ్చిమ రువాండాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, నదులు పొంగిపొర్లు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. కుండపోత వర్షాలకు ఆ దేశంలో 109 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ వార్తా సంస్థ న్యూ టైమ్స్ వెల్లడించింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా ఇళ్లలో నిద్రిస్తున్న అనేక మంది చనిపోయారని తెలిపింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం పడటం వల్ల ఈ ప్రమాదంలో ఎక్కువమంది చనిపోయారని అధికారులు అంచనా వేస్తున్నారు.
వరదల కారణగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయని.. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని గవర్నర్ ఫ్రాంకోయిస్ హబిటెగెకో తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. కుండపోత వర్షాలతో రువాండా అతలాకుతలమైందని వెల్లడించారు. భారీగా ప్రాణనష్టం సంభవించిందని పేర్కొన్నారు. దీనిని అత్యంత భారీ విపత్తుగా ప్రభుత్వ వార్తాపత్రిక న్యూ టైమ్స్ అభివర్ణించింది.