కరోనా దెబ్బకి ప్రపంచమంతా స్తంభించిపోయింది. అగ్ర రాజ్యాల నుంచి చిన్న చిన్న దేశాల వరకు అన్నీ అతలాకుతలం అవుతున్నాయి. దీని ప్రభావం చాలా రంగాలపై పడింది.. దీంతో రంగాలు కుదేలవడంతో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆన్‌లైన్ కొనుగోళ్లపై ఆధారపడటంతో.. డిమాండ్‌కు తగినట్లుగా అమెజాన్ సంస్థ అమెరికాలో 33,000 ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు బుధవారం తెలిపింది. కార్పొరేట్, టెక్ స్థానాల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నది.
వీటిలో అలెక్సా, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఆపరేషన్స్ టెక్నాలజీ, ప్రైమ్ వీడియోలో ఖాళీలు ఉన్నాయని తెలిపింది. కాగా అమెజాన్ తన 2020 కెరీర్‌డే ఈవెంట్‌ను సెప్టెంబర్ 16న నిర్వహించనుంది. ఈ విషయాన్ని అమెజాన్ మానవ వనరుల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.