ఓవైపు కెనడాలోని కార్చిచ్చు.. మరోవైపు దక్షిణాది నుంచి వీచే వడగాలులు అమెరికా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కార్చిచ్చు.. వడగాలులు అమెరికాను మరింత తీవ్ర ఇబ్బంది పెట్టే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఒకసారి కెనడా పొగతో ఉక్కిరిబిక్కిరైన అమెరికన్లకు మరోసారి కళ్ల నీళ్లు తెప్పించే ముప్పు పొంచి ఉందని పేర్కొంది. గాలిలో తేమ కారణంగా చొక్కాలు తడిసేంత చెమటలు పట్టనున్నాయని వెల్లడించింది.
గత కొంతకాలంగా.. కెనడా వ్యాప్తంగా 400 చోట్ల అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు ఆ దేశం సహా అమెరికా తూర్పు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దట్టమైన పొగ కారణంగా ఈ రెండు దేశాల్లో కోట్లాది ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆకాశంలో దట్టమైన పొగ అలముకుని రోజువారీ జీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పటికే వడగాలులు ప్రాణాంతకంగా మారిన సంగతి తెలిసిందే. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. కెనడా పొగ మధ్య పశ్చిమ, తూర్పు ప్రాంతాలను ముంచెత్తనుంది. కెనడాలో 235 చోట్ల అడవుల్లో కార్చిచ్చు వ్యాపించింది. వాటిని నియంత్రించడం సాధ్యం కావడం లేదు.