కొవిడ్-19 .. ఈ పేరు రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించింది. ఎన్నో లక్షల మంది ప్రాణాలు బలితీసుకుంది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. మరెంతో మందిని దీర్ఘకాలిక అనారోగ్యానికి గురిచేసింది. పలుదేశాల ఆర్థిక స్థితి గతులను మార్చేసింది. ఇంతటి విధ్వంసాన్ని సృష్టించిన ఈ మహమ్మారి కరోనా.. చైనా ఉద్దేశపూర్వకంగా ప్రజలకు అంటించేందుకు తయారు చేసిన జీవాయుధమని వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ పరిశోధకుడు చోవోషావ్ పేర్కొన్నారు. ఈ వైరస్‌ను జీవాయుధంలా వాడుకునేలా చైనా మార్పులు చేసిందని తెలిపారు.
ఇంటర్నేషనల్ ప్రెస్ అసోసియేషన్ సభ్యురాలు జెన్నిఫర్ ఝెంగ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఈ ల్యాబ్‌లో ఉన్నతాధికారి ఒకరు మొత్తం నాలుగు రకాల వైరస్‌లను తమ సహచరులకు ఇచ్చి.. ఏది వేగంగా ఎక్కువ జాతులకు వ్యాపిస్తుందో గుర్తించాలని ఆదేశించారని తెలిపారు. దీంతోపాటు సులువుగా దీనిని వేరే వ్యక్తులు, జాతులకు సోకేలా చేసేందుకు ఉన్న మార్గాలను కనుగొనాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను చోవో ఓ జీవాయుధంతో పోల్చారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.