అమెరికా అధ్యక్షుడిగా పదవి నుంచి దిగిపోతూ దేశవిదేశాలకు చెందిన కీలకమైన పత్రాలను సొంత నివాసానికి తరలించుకువెళ్లినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆ రహస్య పత్రాలను ట్రంప్ తన నివాసంలో చిందరవందరగా పడేశారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. సొంత ఎస్టేట్‌లో పడక గది నుంచి స్టోర్‌రూం, బాత్రూంల వరకు అన్నిచోట్లా పెట్టెల్లో పత్రాలను వదిలేశారని కోర్టుకు తెలిపారు.
దేశ భద్రత, సైనిక రహస్యాలను ఓ ప్రైవేటు పార్టీలో బయటి వ్యక్తులకు ఆయన చేరవేశారని నేరాభియోగాల్లో పేర్కొన్నారు. ఫ్లోరిడాలో ట్రంప్‌నకు చెందిన మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో దాదాపు 13,000 పత్రాలు లభించాయని దర్యాప్తు అధికారులు తెలిపారు. వీటిలో దాదాపు 300 పత్రాలు అత్యంత రహస్యమైనవని చెప్పారు. వీటన్నింటినీ ట్రంప్ ఎస్టేట్‌లోని బాల్‌రూమ్, బాత్రూం, పడకగదిలో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్వేతసౌధాన్ని ట్రంప్ వీడిన తర్వాత ఏడాది కాలంలో కొన్ని వేల మంది ఆయన నివాసంలోని క్లబ్బుకు వచ్చారని చెప్పారు.