చైనాలో అవినీతికి పాల్పడిన ఇద్దరు మాజీ మంత్రులకు మరణశిక్ష

చైనాలో అవినీతికి పాల్పడే వారిపై ఆ దేశ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ అవినీతికి పాల్పడే అధికారులైనా.. ప్రజాప్రతినిధులనైనా వదలిపెట్టడం లేదు. రెండ్రోజుల వ్యవధిలోనే చైనాలో ఇద్దరు మాజీ మంత్రులకు ఆ సర్కార్ ఉరిశిక్ష విధించింది. 2012లో పీఠం ఎక్కినప్పటి నుంచి అవినీతికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న జిన్‌పింగ్‌.. అప్పటినుంచి అధికారులు, రాజకీయ నేతలకు కఠినశిక్షలు అమలు చేస్తున్నారు.

 

అవినీతికి పాల్పడేవారు సొంత పార్టీనేతలైనా జిన్‌పింగ్ ఉపేక్షించటం లేదు. ఇప్పటికే న్యాయశాఖ మాజీమంత్రిసహా మరో అధికారికి రెండ్రోజులక్రితం మరణశిక్ష విధించగా.. మరో మాజీమంత్రికి ఉరిశిక్ష ఖరారు చేశారు. లంచం తీసుకోవడం, స్టాక్‌ మార్కెట్లలో అవకతవకలు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నట్లు నిరూపితం కావడంతో చైనా మాజీ ప్రజా భద్రతా ఉప మంత్రి సన్ లిజున్‌కు మరణశిక్ష విధించారు. సన్‌ లిజున్‌ తన జీవితకాలం రాజకీయ హక్కులను కోల్పోయారని.. ఆయన సొంత ఆస్తులను జప్తు చేస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఐదుగురు మాజీ పోలీసు ఉన్నతాధికారులకు ఇటీవలె జైలుశిక్ష విధించగా.. సన్‌ లిజున్‌కు తాజాగా శిక్ష పడింది.