లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం.. దీనిపై భారతీయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవ్వడంతో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్ మాల్దీవులకు విమానాల బుకింగ్‌లను నిలిపివేసింది. తాజాగా దీనిపై అక్కడి టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్ల సంఘం(MATATO) స్పందించింది. తమ నేతలు కొందరు చేసిన విచారకరమైన వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఈజ్‌మైట్రిప్‌ను కోరింది. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, తమ దేశానికి విమాన బుకింగ్‌లను తెరవాలని మటాటో లేఖ రాసింది.
రెండు దేశాల మధ్య రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉందని ఈ సందర్భంగా మటాటో తెలిపింది. భారతీయులను సొంత వారిగా భావిస్తామని లేఖలో పేర్కొంది. తమ పర్యాటక రంగంలో భారతీయులు అత్యంత కీలకమని వెల్లడించింది. ఈ నేతల వ్యాఖ్యలను ఆ దేశ పర్యాటక పరిశ్రమ సంఘం (మాటీ) ఖండించిన సంగతి తెలిసిందే. భారత్ తమకు స్థిరమైన, కీలక పర్యాటక వనరు అని మాటీ ఓ ప్రకటన విడుదల చేసింది. కొవిడ్ తర్వాత మేం కోలుకోవడానికి ఆ దేశం ఎంతో సాయం చేసిందని పేర్కొంది. ప్రతి సంక్షోభంలోనూ భారత్ తమకు సాయంగా నిలుస్తోందని వెల్లడించింది.