రష్యాపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ ఆ కాసేపటికే వెనక్కి తగ్గారు. అసలు ప్రిగోజిన్ తిరుగుబాటు ఎందుకు చేశారు..? అతడి అసలు టార్గెట్ ఏంటి..? అనే దానిపై తాజాగా అమెరికా మీడియా ఓ అంచనాకు వచ్చింది. రష్యా రక్షణ శాఖలో ఇద్దరు కీలక వ్యక్తులను పట్టుకునేందుకు ప్రిగోజిన్ ఇదంతా చేశారని యూఎస్ మీడియా చెబుతోంది.
రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు, ఆర్మీ జనరల్ గెరసిమోవ్‌లను బంధించాలనే లక్ష్యంతోనే ప్రిగోజిన్ రొస్తోవ్ ఆన్ డాన్‌లోని సైనిక స్థావరాన్ని ఆధీనంలోకి తీసుకొన్నాడని అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్ వెల్లడించింది. వారిద్దరూ ఉక్రెయిన్ సరిహద్దుల సందర్శనకు వచ్చిన సమయంలో తన కుట్రను అమలు చేయాలని ప్రిగోజిన్ భావించాడని తెలిపింది. మరోవైపు రష్యా సైన్యంలోని ఓ కీలక కమాండర్‌కు ప్రిగోజిన్ తిరుగుబాటు చేస్తాడనే విషయం ముందే తెలుసని అమెరికా పత్రికలు పేర్కొన్నాయి. ఈ తిరుగుబాటు మొదలయ్యాక వెనక్కి తగ్గాలంటూ ప్రిగోజిన్‌కు ఆ కమాండరే సూచించాడని వివరించాయి.