ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం – వెనక్కి తగ్గేదే లేదన్న నెతన్యాహు

-

ఇజ్రాయెల్ – హమాస్ల మధ్య యుద్ధం మళ్లీ తీవ్ర స్థాయికి చేరింది. ఓవైపు గాజాపై ఇజ్రాయెల్ విరుచుకు పడుతుంటే.. మరోవైపు హమాస్ మళ్లీ ఇజ్రాయెల్పై దాడులకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హమాస్‌ మిలిటెంట్లను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు రాక్షసులుగా అభివర్ణించారు. హమాస్‌ దాడిలో అక్టోబరు 7న మృతి చెందిన ఇజ్రాయెలీల స్మారకార్థం జరిగిన కార్యక్రమంలో సోమవారం రోజున మాట్లాడారు.

‘‘మేం హమాస్‌ చెరలోని బందీలను ఒక్క సెకను కూడా మరిచిపోం. బందీలందరినీ ఇంటికి తెస్తాం. వారి ఉగ్రవాదం అంతమయ్యేవరకు నిద్రపోం. వాళ్లో.. మేమో తేల్చుకుంటాం. అక్టోబరు 7 దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ నిర్మూలిస్తాం. మళ్లీ ఆయుధాలు పట్టకుండా వారి చేతులను నరికేస్తాం’’ అని పేర్కొన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అని నెతన్యాహు స్పష్టం చేశారు.

మరోవైపు ఉత్తర గాజాలోని జబాలియా ప్రాంతంపై టెల్‌ అవీవ్‌ గగనతల దాడులు చేస్తోంది. యుద్ధం ఆరంభంలో జబాలియాపై ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు (ఐడీఎఫ్‌) భారీగా దాడి చేశాయి. హమాస్‌ మిలిటెంట్లను ఏరివేశాయి. మళ్లీ ఆ ప్రాంతంలో హమాస్‌ జోరు పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news