నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడట. అధిక బరువుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కిమ్.. తీవ్రమైన నిద్రలేమితో బాధపడుతున్నాడని దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎన్‌ఐఎస్) తెలిపింది. దీనికి తోడు అతడు విపరీతంగా బరువు పెరిగినట్లు గుర్తించింది. అతడికి ఉన్న ఆల్కహాల్, నికోటిన్ వ్యసనాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా అధికారులు.. కిమ్ నిద్రలేమి సమస్యకు చికిత్స కోసం లోతైన వైద్యసమాచారం సేకరించే పనిలో పడ్డట్లు ఎన్ఐఎస్ గుర్తించింది. ఈ మేరకు ఎన్‌ఐసీ బ్రీఫింగ్స్‌ను ద.కొరియా పార్లమెంటరీ ఇంటెలిజెన్స్ కమిటీ సభ్యుడు యూసాంగ్ బూమ్ మీడియాతో పంచుకొన్నారు. ఇటీవల ఉత్తరకొరియా భారీ ఎత్తున విదేశీ సిగరెట్లను, ఆల్కహాల్‌తో పాటు తీసుకునే చిరుతిళ్లను దిగుమతి చేసుకొన్నట్లు వెల్లడించారు. దీనికి కిమ్ ఇటీవలి చిత్రాలను కృత్రిమ మేధతో విశ్లేషించగా.. అతడు బరువుపెరిగినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం 140 కిలోల వరకు ఉండొచ్చని పేర్కొన్నారు.