ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో.. తన తల్లి ఉషా చేసిన భారతీయ మిఠాయి బర్ఫీని పంచుకున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు. సోమవారం జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడటానికి ముందు ఆయన ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో(రీల్)ను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
‘‘గత నెలలో నా సొంత పట్టణమైన సౌతాంప్టన్‌లో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి నేను వెళ్లాను. ఆ సమయంలో నా కోసం మా అమ్మ బర్ఫీలను తయారు చేసి తీసుకొని వచ్చింది. ఆ తరువాత నేను ఉక్రెయిన్ అధ్యక్షుడిని కలిశా. ఆయన నేను మాట్లాడుకుంటుండగా.. మా అమ్మ నాకు ఇచ్చిన బర్ఫీలో కొంత భాగాన్ని జెలెన్‌స్కీకి ఇచ్చాను. అది చూసి ఆమె ఎంతో ఆనందించింది’’ అని రిషి వివరించారు. ఇదిలా ఉండగా అమెరికా, బ్రిటన్‌లు ఉక్రెయిన్‌కు గట్టి మద్దతు ఇస్తాయని సునాక్ పునరుద్ఘాటించారు. ఇదే విషయాన్ని జెలెన్‌స్కీకి సునాక్ ఫోన్‌లో తెలిపారు.