వచ్చే ఏడాదిలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీచేసేందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్న ట్రంప్‌నకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పోర్న్ స్టార్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్‌పై.. తాజాగా రహస్యపత్రాల కేసులో ఏడు అభియోగాలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ట్వీట్ చేశారు.
అవినీతిలో కూరుకుపోయిన బైడెన్ ప్రభుత్వం.. తనపై అభియోగాలు మోపినట్లు తన న్యాయవాదికి సమాచారం ఇచ్చిందని, అంతా బూటకమని ట్రంప్ ట్విటర్ వేదికగా తెలిపారు. అమెరికా చరిత్రలోనే మొదటిసారి మాజీ అధ్యక్షుడు, కమాండర్-ఇన్-చీఫ్ అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. వచ్చే మంగళవారం మియామి కోర్టుకు హాజరుకావాలని నోటీసులు జారీ అయినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడికి ఇలా జరుగుతుందని తాను అనుకోలేదని అన్నారు.
ట్రంప్ చేసిన ప్రకటనపై న్యాయశాఖ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘిస్తూ రహస్య పత్రాలను ఉద్దేశపూర్వకంగా ఉంచుకోవటం, తప్పుడు ప్రకటనలు చేయడం, న్యాయాన్ని అడ్డుకోవడం వంటి ఏడు అభియోగాలు.. తన క్లయింట్ ట్రంప్‌పై నమోదైనట్లు ఆయన తరఫు న్యాయవాది జిమ్ ట్రస్టీ అంతర్జాతీయ మీడియాకు తెలిపారు.