తెలుగు చిత్ర సీమలో హాస్య నటుడిగా ప్రముఖంగా గుర్తింపు పేరొందింది ఎవరు అనే ప్రశ్న ఎవరికి ఎదురైనా.. అందరరూ ఠక్కున చెప్పే పేరు బ్రహ్మానందం. అయితే, బ్రహ్మానందంను మించిన రికార్డులు క్రియేట్ చేసిన స్టార్ కమెడియన్ ఒకరున్నారు. ఆయనే దివంగత నటుడు ఎం.ఎస్.నారాయణ.
ఈయన అసలు పేరు మైలవరపు సత్యనారాయణ. కాగా, ఎంఎస్ నారాయణగానే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. నవ్వుల రేడుగా పేరు గాంచిన ఎంఎస్ నారాయణ ఏప్రిల్ 16న, 1951లో జన్మించారు. బ్రహ్మానందం మాదిరిగానే ఈయన కూడా లెక్చరర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత చిత్ర సీమ వైపు అడుగులు వేశారు. తాను చనిపోయేంత వరకు వివిధ రకాల పాత్రలను విలక్షణమైన శైలిలో పోషించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.
ఎంఎస్ నారాయణ తాగుబోతు పాత్రలకు పెట్టింది పేరుగా ఉండేవారు. అయితే, ఆయన రియల్ లైఫ్ లో డ్రింక్ చేయబోరు. కానీ, రీల్ లైఫ్ అనగా సిల్వర్ స్క్రీన్ పైన మాత్రం తాగు బోతు పాత్ర పోషించిన ప్రేక్షకుల మెప్పు పొందారు. ‘ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లే..ప్రయత్నం విరమిస్తే మరణించినట్లే’ అని తన జీవనం ద్వారా ప్రజలకు చెప్పిన ఎంఎస్ నారాయణ గొప్ప నటుడే కాదు..గొప్ప వ్యక్తి కూడా. శనివారం ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆయన సాధించిన రికార్డుల గురించి తెలుసుకుందాం.
హాస్య బ్రహ్మగా పేరు గాంచిన స్టార్ కమెడియన్ బ్రహ్మానందం 20 ఏళ్లలో 700 చిత్రాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందగా, ఎంఎస్ నారాయణ 17 ఏళ్లలోనే 700 చిత్రాలు చేసి ఆయన రికార్డును బద్ధలు కొట్టారు.
తన కెరీర్ తొలినాళ్లలో నారాయణ రైటర్ గా పని చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తదితరుల సినిమాల్లో కమెడియన్ గా నటించిన ఎంఎస్ నారాయణ..వారితో ప్రత్యేకమైన మైత్రి, అనుబంధం కలిగి ఉన్నారు. 2015 జూన్ 23న అనారోగ్య సమస్యలతో ఎంఎస్ నారాయణ మరణించారు.