ఆయన మాజీ మంత్రి. టీడీపీలో రాజకీయాలు చేయడంలో ఆయన దిట్ట. గుంటూరుకు చెందిన సీనియర్ నాయకుడు. ముఖ్యంగా రాజధాని ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి కూడా ఆయన యాక్టివ్ అయ్యారు. ఆయనే తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అనూహ్యంగా ఆయన విషయం రాజకీయాల్లో చర్చకు వచ్చింది. అదేంటంటే.. కమ్మసామాజికవర్గానికి చెందిన రాజాను.. అదే కమ్మసామాజిక వర్గం దూరం పెట్టిందని అంటున్నారు. పరిస్థితులను గమనిస్తే.. ఇది నిజమేనని అనిపిస్తోంది.
రాజధాని అమరావతి కోసం ఉద్యమించిన నాయకులతో పాటు రాజా కూడా ఉన్నారు. నిత్యం ఇక్కడ రైతులను కలుస్తూ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్న ఆయన దూకుడుతో.. కమ్మ వర్గం హర్ట్ అవుతోందని అంటున్నారు పరిశీలకులు. స్తానికంగా టీడీపీ నాయకులు భూములు కొన్నారని.. వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిని అడ్డు పెట్టుకునే రాజధాని నిర్మాణాలు కూడా నిలిచిపోయాయి. అయితే.. అడపాదడపా .. వైసీపీపై విమర్శలు చేస్తున్న టీడీపీ నాయకులు భూముల విషయాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోరు.
కానీ, రాజేంద్ర ప్రసాద్ మాత్రం.. కొన్నాళ్లుగా ఎంపీ గల్లా జయదేవ్ టార్గెట్‌గా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. మేం ఇన్నాళ్లు పోరాటం చేసినా.. పోలీసులతో విభేదించి.. వారితో తిట్టుతిన్నా.. రాని గుర్తింపు ఎంపీ ఒక్కసారి వస్తే.. ఆయనకు ఇస్తున్నారని రాజా పరోక్షంగా వ్యాఖ్యలు సంధించారు. అంటే. రాజధాని విషయంలో తనకు గుర్తింపు రావడం లేదని ఆయన భావిస్తున్నారు.
ఇది చిలికిచిలికి గాలి వానగా మారి.. గల్లాను అనుసరిస్తున్న కమ్మ వర్గం రాజాను దూరం పెట్టిందని తెలుస్తోంది. దీంతో రాజా కూడా వెనక్కి తగ్గకుండా.. భూములు కొన్నవారిపై చర్యలు తీసుకోవాల్సిందే.. సీబీఐ వేయాల్సిందేనని ఇటీవల డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. మొత్తానికి ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.