ఎక్కడా లేని విధంగా ఏపీలో రాజధాని అంశంపై రాజకీయ క్రీడ నడుస్తున్న విషయం తెలిసిందే. విడిపోయిన రాష్ట్రానికి గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. దీనికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా మద్ధతు ఇచ్చింది. సరే ఏదొకటి ముందు రాజధాని అంటూ వచ్చిందని ప్రజలు భావించారు. అమరావతి పెట్టినప్పుడు రాష్ట్రంలో పెద్దగా అభ్యంతరాలు రాలేదు. కాకపోతే ఇక్కడ టీడీపీ అక్రమాలకు పాల్పడిందని వైసీపీ తీవ్ర స్థాయిలో ఆరోపించింది.
ఇలా ఆరోపణలు చేసింది గాని…2019 ఎన్నికల ముందు రాజధాని మారుస్తామని చెప్పలేదు. కానీ ఈ ఆరోపణలని బేస్ చేసుకుని..2019 తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్….మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమని మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. 2019 డిసెంబరు 17న శాసనసభ వేదికగా ‘మూడు రాజధానులు’ అని ప్రకటన చేశారు. ఆ తర్వాత నుంచే అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు అమరావతి కోసం ఉద్యమించడం మొదలుపెట్టారు. మొదట కొన్ని గ్రామాలకే పరిమితమైన ఈ ఉద్యమం…తర్వాత రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్ష టీడీపీ పోరాటం చేయడం మొదలుపెట్టింది.
వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ అమరావతికి మద్ధతు తెలిపాయి. ఇక అమరావతి ఉద్యమాన్ని అణిచి వేయడానికి వైసీపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో అందరికీ తెలిసిందే. అలా అని మూడు రాజధానుల ఏర్పాటు కూడా ఇంతవరకు చేయలేదు. న్యాయ పరమైన సమస్యలు ఉండటంతో మూడు రాజధానులు అమలు సాగుతూ వచ్చింది. ఇక త్వరలోనే కొత్త బిల్లుతో వస్తామని వైసీపీ నేతలు అంటున్నారు.
ఇటు అమరావతి రైతులు, ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా అమరావతికి మద్ధతు తెలిపేలా పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే న్యాయస్థానం టూ దేవస్థానం అని చెప్పి అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రకు కాస్త మధ్య మధ్యలో అడ్డంకులు వచ్చాయి గాని…చివరికి సాఫీగా సాగింది. వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు కూడా సహకరించడం విశేషం. ఇప్పుడు అమరావతి టూ అరసవెల్లి అని చెప్పి…ఉత్తరాంధ్ర జిల్లాల వారీగా పాదయాత్ర చేయడానికి రెడీ అయ్యారు.
కానీ ఉత్తరాంధ్రలో పాదయాత్ర అడ్డుకుంటామని వైసీపీ మంత్రులు అంటున్నారు. వారి మద్ధతు కూడా తెచ్చుకుంటామని రైతులు అంటున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి. ఉత్తరాంధ్రలో వైసీపీ శ్రేణులు యాంటీగా ఉండొచ్చు ఏమో గాని…ప్రజలు అమరావతిపై వ్యతిరేకంగా ఉండరని అంటున్నారు. చూడాలి మరి అమరావతికి ఉత్తరాంధ్ర మద్ధతు దక్కుతుందో లేదో.