అధికార వైసీపీలో యువ నేతలు ఎక్కువ. ఒకప్పుడు టీడీపీలో యువ నేతలు ఎక్కువగా ఉండేవారు. దీంతో పార్టీని వారే నడిపించాలని.. వారే భావి పార్టీ నిర్ణయాక శక్తి అని చంద్రబాబు పదే పదే చెప్పేవారు. కానీ, రాను రాను కురువృద్ధుల పార్టీగా టీడీపీ అవతరించనుంది. యువత అచేతన స్తితిలోకి వెళ్లిపోయారు. చంద్రబాబు కొందరినే సమర్ధించడం, మరికొందరిని దూరం పెట్టడం, తన సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడం వంటి పరిణామాలు బాబుకు, పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారాయి.
సరే.. ఇప్పుడు వైసీపీలో సీఎం నుంచి మంత్రుల వరకు (ఓ నలుగురు మినహా.. పెద్దిరెడ్డి, బొత్స, రంగనాథరాజు, నారాయణ స్వామి వంటివారు) అంతా యువ నేతలే హల్‌చల్ చేస్తున్నారు. మహిళా మంత్రులు కూడా 45 ఏళ్లలోపు వయసున్నవారే. ఇక, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా యువతే ఎక్కువగా ఉన్నారు. 22 మంది ఎంపీల్లో అందరూ దాదాపు 45 ఏళ్లలోపే ఉన్నారు. ఎమ్మెల్యేల్లోనూ సగానికిపైగా 45 ఏళ్లలోపు వారే. దీంతో పార్టీ పరుగులు తీస్తుందని, జయకేతనం ఎగురవేయడంలో వీరి పాత్ర మరింత ఎక్కువగా ఉంటుందని అందరూ అనుకున్నారు.
కానీ, చిత్రంగా అటు మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మౌనం పాటిస్తున్నారు. ఎక్కడా బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. నియోజకవర్గాల్లోనూ చేస్తే.. చేశారని అనుకోవడం లేకపోతే ఫుల్‌గా సైలెంట్ అయ్యారని భావించడం తప్ప ఏమీ కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటి? అని పరిశీలిస్తే.. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులు అజెండా, జిల్లాల విభజన.. వంటి కీలకనిర్ణయాలపై సమాధానం చెప్పలేక పోతున్నారని కొందరు అంటున్నారు.
ఇక, వీటికితోడు కరోనా నేపథ్యంలో కొందరికే ప్రభుత్వం నుంచి సాయం అందిందని, ఈ నేపథ్యంలోనూ ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే వారు మౌనాన్ని ఆశ్రయించారని ప్రచారం జరుగుతోంది. ఇక ప్రభుత్వ పథకాలు ( ప్రభుత్వం అందరికి కామన్‌గా ఇచ్చేవి కాకుండా) కూడా పై స్థాయిలో కొందరు నేతలకు మాత్రమే అందుతున్నాయట. ఏదేమైనా అధికార పార్టీలో యువత ఎక్కువగా ఉన్నప్పటికీ.. జగన్ వీరిని వాడుకోవడంలో ఎక్కడో పొరపాటు చేస్తున్నారనే టాక్ మాత్రం బాహాటంగానే బయటకు వస్తోంది.
-vuyyuru subhash