నాదెండ్ల మనోహర్.. మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఈయన.. ఎంతో ఫ్యూచర్ ఉంచుకుని కూడా సరైన దశ, దిశ లేని పయనం కారణంగా.. ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో గతంలో ఉన్న అంకితం భావం ఇప్పుడూ ఉండాల్సిందే. అయితే, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే.. పార్టీలను పట్టుకుని నాయకులు ఎదిగారు. కానీ, ఇప్పుడు పార్టీలే నేతలను పట్టుకుని ఎదుగుతున్నాయ్. అంటే.. నేతలే పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వైసీపీ, టీడీపీల్లో ఇలాంటి నాయకులే ఉన్నారు.
అందుకే వారంతా సక్సెస్ రేటుతో ముందుకు సాగుతున్నారు. అయితే, ఈ తరహాలో వ్యవహరించాల్సిన నాదెండ్ల మనోహర్ మాత్రం దూకుడు లేకుండా.. తనకంటూ.. ఓ వేదిక లేకుండా.. ఫ్యూచర్ ఏంటనేది కూడా నిర్దేశించుకోలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ తరఫున గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా నాదెండ్ల మంచి గుర్తింపు పొందారు. వివాద రహితుడిగా.. ఆయన మంచి పేరే తెచ్చుకున్నారు. కానీ, తండ్రి భాస్కరరావు మాదిరిగా దూకుడు చూపించలేక పోవడం.. రాజకీయాల్లో ముందుకు సాగలేక పోవడం తీవ్రస్థాయిలో ఆయన ఫ్యూచర్‌ను దెబ్బతీస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
ప్రస్తుతం జనసేన రాజకీయ వ్యవహారాల చైర్మన్‌గా ఉన్న నాదెండ్లకు పనిచేయాలనే లక్ష్యం ఉంటే.. దూకుడుకు ఎలాంటి అడ్డంకులు లేవు. అదే సమయంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినా.. పవన్ ఆపుతారని అనుకోలేం. పార్టీని డెవలప్ చేస్తామంటే.. ఎవరు మాత్రం వద్దని అంటారు. కానీ, నాదెండ్ల మాత్రం ఎక్కడాబయటకు రావడం లేదు. పోనీ.. గంభీరమైన వాయిస్ వినిపిస్తున్నారా? అంటే.. అది కూడా కనిపించడం లేదు.
ఏదో ప్రెస్‌నోట్లు విడుదల చేయడంతోనే సరిపెడుతున్నారు. ఈ పరిణామం.. వ్యక్తిగతంగా ఆయనను రాజకీయంగా కోలుకోలేకుండా చేస్తోంది. అదే సమయంలో జనసేనకు కూడా ఇబ్బందిగానే మారిందని ఆ పార్టీ అభిమానులు సైతం పేర్కొంటున్నారు. పోనీ ఉలుకు పలుకు లేని జనసేన కంటే లైమ్ టైమ్‌లో ఉన్న పార్టీలో ఆయన ఉండి ఉండే ఆయన రాజకీయ జీవితమే వేరుగా ఉండేది. మొత్తానికి ఇదే తరహాలో కొనసాగితే.. రాజకీయంగా మనోహర్ ఉనికి కోల్పోవడం ఖాయమని అంటున్నారు.