భారత్ బంద్ కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు భవిష్యత్ లో దగ్గర అయ్యే అవకాశం ఉందా ? జాతీయ స్థాయిలో బిజేపిపై పోరాటంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేసే చాన్స్ ఉందా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ఆ దిశగా అడుగులు పడే అవకాశం కుడా లేకపోలేదని తెలుస్తుంది.రెండు పార్టీల నేతల్లో కలిసి పనిచేస్తే బాగుంటుందని కొందరు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు..
రైతులు దేశ వ్యాప్తంగా తలపెట్టిన భారత బంద్ కు రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు భారత్ బంద్ కు జై కొడుతున్నాయి. ఇటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మద్దతు పలికింది. తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భారత్ బంద్ ను సక్సెస్ చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగుతున్నారు. పార్టీ నిర్ణయం ప్రకారంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్ ను విజయవంతం చేసే పనిలో ఉంది. ఆ పార్టీ నేతలు కూడా భారత్ బంద్ కు మద్దతు ప్రకటించారు .
భారత్ బంద్ కు ఇటు టిఆర్ఎస్ అటు కాంగ్రెస్ మద్దతు పలకడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. రైతుల విషయంలో రెండు పార్టీలు ఒకే వైఖరి తీసుకోవడంతో ఆ రెండు పార్టీలు దగ్గరయ్యే పరిస్థితులు వస్తున్నాయా అన్న చర్చ మొదలైంది. ఇక ముందు కూడా బిజేపి విషయంలో టిఆర్ఎస్ పోరాటం చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగుతారా అన్న విశ్లేషణలు జరుగుతున్నాయి.
బిజేపి ,కాంగ్రెస్ పార్టీలు జాతీయ స్థాయిలో విఫలం అయ్యాయని సీఎం కెసీఆర్ చాలా సందర్భాల్లో అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బిజేపియేతర కూటమి అవసరం ఉందని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఆ దిశగా ఫెడరల్ ప్రంట్ అలోచనను కూడా బయట పెట్టారు కేసిఆర్. పలు ప్రాంతీయ పార్టీల అధినేతలతో మంతనాలు జరిపారు కేసిఆర్. తాజాగా డిసెంబర్ రెండవ వారంలో సదస్సు నిర్వహిస్తామని పార్టీ అంతర్గత సమావేశంలో ప్రకటించారు కేసిఆర్. ఇప్పుడు తాజాగా భారత్ బంద్ పిలుపుకు మద్దతు ప్రకటించారు కేసిఆర్. ఇటు కాంగ్రెస్ కూడా భారత్ బంద్ కు మద్దతు తెలపడంతో రెండు పార్టీలు భవిష్యత్ లో పలు అంశాలపై కలిసి పనిచేసే అవకాశం పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది .
నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ బాగా బలహీనపడిపోయింది. నాయకత్వలోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరితో కలిసి వెళ్తేనే మంచిదనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది. అటు టియ్యారెస్ మిడిల్ క్యాడర్ లో కూడా ఈ చర్చ జరుగుతోంది. 2023 ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కోవాలంటే మరింత బలపడాల్సి ఉందని, కాంగ్రెస్ కంటే ఇప్పుడు బిజెపియే పెద్ద శత్రువని, కనుక కాంగ్రెస్ ని కలుపుకుని బిజెపిని ఎదుర్కోవటంలో తప్పేం లేదని కొందరి అభిప్రాయం.