ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ‘జబర్దస్త్’ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజలను, సినీ ప్రేక్షకులను నవ్వించే కార్యక్రమంగా ఈటీవీ మల్లెమాల వారు ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు వారికి మరింత దగ్గరైన సీనియర్ నటి, పొలిటీషియన్ రోజా..ఈ కార్యక్రమానికి జడ్జిగా చాలా కాలం పాటు వ్యవహరించింది.
తాజాగా ఆమె ఈ షోకు గుడ్ బై చెప్పేసింది. ఏపీ పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధిశాఖ మంత్రిగా రోజా గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే ‘జబర్దస్త్’ టీమ్ వారు రోజాకు కన్నీటి వీడ్కోలు పలికారు. ‘జబర్దస్త్’ షో ప్రారంభమైన నాటి నుంచి జడ్జిగా వ్యవహరించిన రోజా..ఇక షోకు రాబోరు అని తెలుసుకుని జబర్దస్త్ కమెడియన్స్ కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ షోకు వచ్చిన తర్వాత వైసీపీ నుంచి నగరి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన రోజా..తాజాగా ఏపీ మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కించుకుంది. అమాత్యురాలిగా ప్రజలకు సేవలందించే నేపథ్యంలో తాను ఇక షోకు దూరమవుతున్నానని పేర్కొంది. ఓ వైపు మంత్రి పదవి దొరికిన సంతోషంతో పాటు మరో వైపున ‘జబర్దస్త్’ కార్యక్రమం మిస్ అవుతున్నానన్న బాధలో రోజా కన్నీటి పర్యంతమైంది.
వీడ్కోలు మీటింగ్ లో రోజా మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. మంత్రిని కావాలనుకున్న తన కోరిక నెరవేరిందని, అయితే, జబర్దస్త్ ను తాను చాలా మిస్ అవుతానని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ బాధ తనను వెంటాడుతుందని చెప్పింది. ఇకపోతే రోజా స్థానంలో ఇంద్రజ కాని పూర్ణ కాని వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.