రైతుల సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. గత నాలుగేళ్లుగా రైతులు నష్టపోతూనే ఉన్నారని.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. రైతుల సంక్షేమాన్ని కేవలం పత్రిక ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితం చేశారని ముఖ్యమంత్రిని విమర్శించారు.
మాండస్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాలకు పంటలు నీటమునగడంతో కన్నీరుమున్నీరు అవుతున్న రైతులకు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా శాపంగా మారిందన్నారు. అధికారులను వెంటనే క్షేత్రస్థాయికి పంపించి పంట నష్టాన్ని అంచనా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షానికి తడిసిన పంటలను కూడా మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. వరదలకు పంట కొట్టుకుపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు.